Munugode: ఎన్నికల హామీలు ఎక్కడ అమలు చేశారు?: రేవంత్ రెడ్డి
- టీఆర్ఎస్, బీజేపీ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడి సూటి ప్రశ్న
- అభివృద్ధి నిధులు ఎన్ని తెచ్చారో లెక్క చెప్పాలని డిమాండ్
- హుజురాబాద్, దుబ్బాకలకు కేంద్రం నుంచి తెచ్చిన నిధులు ఎన్ని?
- బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్ లను నిలదీసిన రేవంత్
ఎన్నికల సమయంలో హామీలు గుప్పించడం.. ఎన్నికలు పూర్తవగానే వాటిని అటకెక్కించడం బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తమను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్న హామీలను ఎన్ని నెరవేర్చారో చెప్పాలని బీజేపీ నేతలను ఆయన ప్రశ్నించారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల సంగతేంటని టీఆర్ఎస్ నేతలను నిలదీశారు. తమ నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి జరిగింది, కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులకు సంబంధించి లెక్కలు చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ లను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మళ్లీ అవే హామీలు ఇస్తున్న నేతలను నమ్మొద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతినే గెలిపించాలని ప్రజలను కోరారు. ఓటమి రుచి చూస్తేనే టీఆర్ఎస్, బీజేపీలు తమ హామీలను అమలు చేస్తాయని చెప్పారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో తనను నిలదీస్తున్న ప్రజలను రాజగోపాల్ రెడ్డి బెదిరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓట్లడగడానికి వచ్చి దౌర్జన్యం చేయడమేంటని రాజగోపాల్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి ఏమీ లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. మునుగోడులో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు చెప్పే బంగారు తెలంగాణలో మునుగోడు లేదా? అని నిలదీశారు. కేసీఆర్ ను సీఎం చేసింది రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయడానికి కాదా? అని ప్రశ్నించారు. మునుగోడును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానంటూ మంత్రి కేటీఆర్ చెప్పే మాటలు నమ్మొద్దని ప్రజలను రేవంత్ రెడ్డి కోరారు.