TDP: వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే మా లక్ష్యం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla butchaiah chowdary comments on chandrababu and pawan kalyan meeting
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల భేటీపై స్పందించిన గోరంట్ల
  • ఐక్య కార్యాచరణ కోసమే నేతల భేటీ అన్న టీడీపీ ఎమ్మెల్యే
  • పొత్తులపై సమయానుకూలంగా నిర్ణయాలని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీపై టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దిశగా ఐక్య కార్యాచరణకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారని ఆయన చెప్పారు. ఇరు పార్టీల పొత్తుల గురించి రెండు పార్టీల అధినేతలు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన చెప్పారు. 

మంగళవారం జనసేన కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్... బీజేపీతో పొత్తు ఉన్నా కూడా ఆ పార్టీతో కలిసి ముందుకు సాగడం కుదరడం లేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జనసేన సమావేశం ముగిసిన వెంటనే పవన్ బస చేస్తున్న నోవాటెల్ హోటల్ కు వెళ్లిన చంద్రబాబు ఆయనతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో గోరంట్ల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
TDP
Chandrababu
Pawan Kalyan
Janasena
Gorantla Butchaiah Chowdary

More Telugu News