Telangana: కేసీఆర్ కు దమ్ముంటే ఆ 12 మందితో రాజీనామా చేయించాలి: బండి సంజయ్
- మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంజయ్
- పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి కేసీఆర్ తూట్లు పొడుస్తున్నారని ఆరోపణ
- మునుగోడులో టీఆర్ఎస్ ఒక్కో ఓటుకు రూ.40 వేలు ఇచ్చేందుకు సిద్ధమైందని విమర్శ
తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం ఓ సవాల్ విసిరారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిగూడలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కు దమ్ముంటే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి వారిని గెలిపించుకునే సత్తా కేసీఆర్ కు లేదని సంజయ్ అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.40 వేలు ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందని సంజయ్ ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చిన టీఆర్ఎస్... హుజూరాబాద్ ఉప ఎన్నికలో రూ.20 వేలు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ బొక్కనదంతా కక్కించేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని కూడా సంజయ్ అన్నారు.