Shiva karthikeyan: శివకార్తికేయన్ స్టేజ్ పై ఏడవడం నేను చూశాను: విజయ్ దేవరకొండ
- ఈ నెల 21వ తేదీన రిలీజ్ అవుతున్న 'ప్రిన్స్'
- హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ
- శివ కార్తికేయన్ జర్నీ అంటే ఇష్టమని వెల్లడి
తెలుగులో నాని మాదిరిగానే అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన హీరోగా శివ కార్తికేయన్ కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ప్రిన్స్' రెడీ అవుతున్నాడు. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ స్టేజ్ పై ఆయన మాట్లాడుతూ .. "ఈ రోజున ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉండటం .. ఈ ప్రమోషన్లో భాగమవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది" అని అన్నాడు.
'ఎవడే సుబ్రమణ్యం' సినిమా సమయంలో నాగ్ అశ్విన్ ఎప్పుడూ అనుదీప్ గురించే మాట్లాడేవాడు. ఆయన షార్ట్ ఫిలిమ్స్ చూస్తూ పడి పడి నవ్వేవాడు. 'జాతిరత్నాలు' తరువాత అనుదీప్ 'ప్రిన్స్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. నేను ట్రైలర్ చూశాను .. నాకు బాగా నచ్చింది. నాకు బోర్ కొట్టినప్పుడు అనుదీప్ వీడియోలు చూస్తుంటాను. అందరినీ నవ్వించే అనుదీప్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు.
"శివకార్తికేయన్ ను నేను ఈ రోజునే మొదటిసారిగా కలిశాను. ఫస్టు టైమ్ 'రెమో' పోస్టర్ లో నర్స్ గెటప్పులో ఆయనను చూశాను. ఆయన జర్నీ అంటే నాకు ఇష్టం. కాలేజ్ లైఫ్ తరువాత టీవీలో పనిచేసి .. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ స్టార్ గా ఎదిగాడు. సినిమాపైన ప్రాణం పెడతామంటూ ఒక స్టేజ్ పై స్పీచ్ ఇస్తూ ఆయన ఏడవడం చూసి బాధనిపించింది. ఎప్పుడైనా అవసరమైతే ఆయనకి తోడుగా నిలబడాలని అనుకున్నాను. అందుకే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాను" అంటూ చెప్పుకొచ్చాడు.