Andhra Pradesh: వాల్మీకి, బోయల స్థితిగతులపై ఏకసభ్య కమిషన్ ను నియమించిన ఏపీ ప్రభుత్వం
- బీసీ జాబితా నుంచి ఎస్టీ జాబితాలోకి చేర్చాలంటున్న వాల్మీకి, బోయలు
- ఆ సామాజిక వర్గాల స్థితిగతులపై అధ్యయనానికే ఏకసభ్య కమిషన్
- 3 నెలల్లో నివేదిక అందజేయాలంటూ శామ్యూల్ కమిషన్ కు ఆదేశం
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వాల్మీకి, బోయ, బెంతు ఒరియాల సామాజిక స్థితిగతులపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ సామాజిక వర్గాల స్థితిగతులపై 3 నెలల్లోగా నివేదిక అందజేయాలని కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
రాష్ట్రంలోని వాల్మీకి, బోయలను బీసీల జాబితా నుంచి ఎస్టీ జాబితాలోకి చేర్చాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈ డిమాండ్ సాధ్యాసాధ్యాలు, ఆయా సామాజిక వర్గాల స్థితిగతుల ఆధారంగా ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలపై అధ్యయనం చేసేందుకే ప్రభుత్వం ఈ ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా వీరిని ఎస్టీల జాబితాలో చేర్చే విషయంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.