Ukraine: పరిస్థితులు దిగజారుతున్నాయ్.. తక్షణమే ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోండి: ఇండియన్స్ కు అక్కడి భారత ఎంబసీ హెచ్చరిక
- ఉక్రెయిన్ లో నాలుగు ప్రాంతాల్లో మార్షల్ లా విధించిన రష్యా
- పరిస్థితులు ఏ క్షణంలోనైనా మరింత దిగజారే అవకాశం
- విద్యార్థులతో సహా అందరూ వెళ్లిపోవాలన్న ఇండియన్ ఎంబసీ
ఉక్రెయిన్ లో ఉన్న మన పౌరులకు అక్కడున్న ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. రష్యా చేస్తున్న యుద్ధం నానాటికీ తీవ్రతరమవుతోందని... ఏ క్షణంలోనైనా ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని తెలిపింది. ఇక్కడ ఉండటం ఏ మాత్రం సురక్షితం కాదని హెచ్చరించింది. ఏ కారణం వల్లనైనా ఉక్రెయిన్ కు రావాలనుకునేవారు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ ట్విట్టర్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్ నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని ఇక్కడున్న భారత పౌరులందరినీ, విద్యార్థులతో సహా హెచ్చరిస్తున్నామని తెలిపింది.
ఉక్రెయిన్ లో తమ అధీనంలోకి వచ్చిన నాలుగు ప్రాంతాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మార్షల్ లా విధించారు. దీంతో, ఈ ప్రాంతాలన్నీ రష్యా సార్వభౌమాధికారం కిందకు వచ్చినట్టే లెక్క. ఈ అర్ధరాత్రి నుంచి ఈ చట్టం అమల్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల నుంచి ఉక్రేనియన్లు ప్రాణాలను అరచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
మరోపక్క, ఇదే ఊపులో ఉక్రెయిన్ పై రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసే అవకాశాలున్నాయి. నాటో దళాలు జోక్యం చేసుకుంటే రష్యా అణ్వాయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితులు చేయి దాటితే... అప్పుడు ఉక్రెయిన్ నుంచి బయటపడే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు.