Andhra Pradesh: భూసర్వే పేరుతో మహాయజ్ఞం: సీఎం జగన్

governament aware of farmers problems

  • 15 వేల మంది సర్వేయర్లతో భారీ సర్వే
  • నిషేధిత జాబితాలోని భూముల డీనోటిఫై
  • ఆ భూములపై యజమానులకు సర్వ హక్కులు
  • రైతన్నల కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనదే
  • అవనిగడ్డ పర్యటనలో సీఎం జగన్

రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేసి వాటికి క్లియరెన్స్ ఇస్తున్నామని జగన్ చెప్పారు. అవనిగడ్డలో రైతులకు భూమి పట్టాలు పంచి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. చుక్కల, అనాధీన, నిషేధిత జాబితా 22(1)లోని భూములను డీనోటిఫై చేశామని, ఇకపై ఆ భూములపై యజమానులకు సర్వహక్కులు ఉంటాయని జగన్ తెలిపారు. తమ భూములు అమ్ముకోవచ్చు, బిడ్డల పేరుమీదికి మార్చుకోవచ్చని వివరించారు. గత ప్రభుత్వం 2016 మే నెలలో ఈ భూములను నిషేధిత జాబితాలోకి చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేసిందని సీఎం విమర్శించారు.

రైతుల కష్టాలను అర్థం చేసుకున్న ప్రభుత్వాలు మహానేత వైఎస్సార్ ప్రభుత్వం.. తర్వాత మళ్లీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వమేనని వివరించారు. రాష్ట్రంలో భూసర్వే పేరుతో పెద్ద యజ్ఞం జరుగుతోందని సీఎం చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో భూములకు కచ్చితమైన రికార్డులు లేవని సీఎం చెప్పారు. ఉన్న రికార్డులలోనూ కచ్చితమైన వివరాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదని వివరించారు. ఈ పరిస్థితుల్లో దాదాపు 22 వేల రైతులకు ప్రయోజనం కలిగేలా ఆధునిక టెక్నాలజీ సాయంతో భూముల సర్వే చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 15 వేల మందికి పైగా సర్వేయర్లను మీ అన్న జగనన్న సర్కారు నియమించిందని తెలిపారు. నవంబర్ చివరిలోగా 1500 గ్రామాల్లో భూసర్వే పూర్తిచేసి హద్దులు నిర్ణయిస్తామని సీఎం చెప్పారు. వచ్చే ఏడాదికల్లా 17 వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News