Sports minister: భారత్ ఎవరి మాటా వినే స్థితిలో లేదు: క్రీడా మంత్రి ఘాటు స్పందన

India wont listen to anyone Sports minister Anurag Thakur on BCCI vs PCB Asia Cup and World Cup debate

  • షెడ్యూల్ ప్రకారమే వన్డే ప్రపంచకప్ ఉంటుందని స్పష్టీకరణ
  • ఘనంగా, గొప్పగా నిర్వహించి తీరుతామని స్పష్టీకరణ
  • పాకిస్థాన్ ను కూడా ఆహ్వానిస్తున్నామని ప్రకటన

వచ్చే ఏడాది ఆసియాకప్ కోసం భారత్ పాకిస్థాన్ కు వెళ్లబోదంటూ బీసీసీఐ కార్యదర్శి జైషా చేసిన ప్రకటనకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తీవ్రంగా స్పందించగా.. దీనిపై కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం ఘాటుగా బదులిచ్చారు. ఆసియాకప్ ను తటస్థ వేదికకు మారిస్తే భారత్ - పాకిస్థాన్ క్రీడా సంబంధాలు దెబ్బతినొచ్చంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యానించింది. అంతేకాదు, 2023లో భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ నుంచి తాము తప్పుకుంటామని హెచ్చరించింది. 

ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. భారత్ ఎవరి మాటా వినే స్థితిలో లేదని తేల్చి చెప్పారు. వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచకప్ భారత్ లో జరుగుతుందని.. పాకిస్థాన్ సహా పాల్గొనే దేశాలన్నింటికీ సాదర స్వాగతం పలుకుతున్నామని, ఈ టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందన్నారు. దీంతో రావడం, రాకపోవడం పాకిస్థాన్ ఇష్టమనేలా మంత్రి సంకేతమిచ్చారు. 

‘‘ఇది బీసీసీఐ వ్యవహారం. దీనికి వారు కట్టుబడి ఉంటారు. భారత్ క్రీడా శక్తి. ఎన్నో ప్రపంచకప్ లను గొప్పగా నిర్వహించింది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ కూడా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద జట్లన్నీ ఇందులో పాల్గొంటాయి. ఎందుకంటే ఏ క్రీడలో అయినా భారత్ ను విస్మరించడానికి లేదు. భారత్ క్రీడల కోసం ముఖ్యంగా, క్రికెట్ కోసం ఎంతో సాయమందిస్తోంది. కనుక ప్రపంచకప్ ను వచ్చే ఏడాది చాలా ఘనంగా, చారిత్రాత్మక కార్యక్రమంగా నిర్వహిస్తాం. పాకిస్థాన్ లో పర్యటించడంపై భద్రతాపరమైన ఆందోళనలు ఉంటే దీనిపై కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటుంది’’ అని మంత్రి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News