Andhra Pradesh: అమరావతి రైతుల పాదయాత్ర సాఫీగా సాగేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పండి: హైకోర్టు

ap high court issues notices to amaravati farmers and ap police

  • యాత్రకు అడ్డంకులు కలుగుతున్నాయంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతులు
  • రైతుల పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు
  • పోలీసులు, రైతులకు నోటీసుల జారీ
  • తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన అమరావతి టూ అరసవెల్లి మహాపాదయాత్ర సాఫీగా సాగేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలంటూ పోలీసులు, అమరావతి రైతులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు తమ యాత్రకు అడ్డంకులు ఎదురు కాకుండా చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది.

అమరావతి నుంచి ప్రారంభమైన రైతుల యాత్ర ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిసరాల్లో కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రైతుల యాత్రకు నిరసనగా వైసీపీ శ్రేణులు పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజమహేంద్రవరంలో ఏకంగా రైతుల యాత్రపై వైసీపీ శ్రేణులు రాళ్లు, సీసాలతో దాడికి దిగాయి. దీంతో తమ యాత్ర సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలని రైతులు కోర్టును ఆశ్రయించారు. రైతుల పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు... యాత్ర సజావుగా సాగేందుకు ఇటు రైతులతో పాటు అటు పోలీసులు చేపట్టిన చర్యలను తెలపాలంటూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News