Satya Nadella: 'పద్మ భూషణ్' అవార్డును అమెరికాలో అందుకున్న సత్య నాదెళ్ల
- సత్య నాదెళ్లను పద్మ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్రం
- ఇటీవల అవార్డుల ప్రదానోత్సవం
- భారత్ రాలేకపోయిన సత్య నాదెళ్ల
- అవార్డు అందజేసిన భారత కాన్సుల్ జనరల్
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రతిష్ఠాత్మక 'పద్మ భూషణ్' పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇటీవల 'పద్మ' అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించగా, కొన్ని కారణాల వల్ల సత్య నాదెళ్ల భారత్ రాలేకపోయారు.
ఈ నేపథ్యంలో, ఆయనకు భారత ప్రభుత్వం అమెరికాలోనే 'పద్మ భూషణ్' పురస్కారాన్ని అందించింది. శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్రప్రసాద్ ఈ విశిష్ట అవార్డును సత్య నాదెళ్లకు అందజేశారు.
దీని పట్ల సత్య నాదెళ్ల హర్షం వ్యక్తం చేశారు. 'పద్మ భూషణ్' వంటి గొప్ప అవార్డును అందుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
ఇంకా అభివృద్ధి సాధించే క్రమంలో భారత ప్రజలు మరింత టెక్నాలజీని వినియోగించేలా తమ సహకారం కొనసాగుతుందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. కాగా, వచ్చే ఏడాది జనవరిలో భారత్ వస్తానని వెల్లడించారు. చివరిసారిగా సత్య నాదెళ్ల మూడేళ్ల కిందట భారత్ లో పర్యటించారు.