Helicopter Crash: అరుణాచల్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
- గాలింపు చర్యలు ప్రారంభించిన అధికారులు
- రోడ్డు మార్గంలేనిచోట కూలినట్లు గుర్తింపు
- సహాయక చర్యల కోసం బయల్దేరిన బృందం
- ఇటీవలే కేదార్ నాథ్ లో హెలికాప్టర్ ప్రమాదం
ఆర్మీకి చెందిన అత్యాధునిక హెలికాప్టర్ ఒకటి అరుణాచల్ ప్రదేశ్ లో కూలిపోయినట్లు సమాచారం. ఆర్మీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. అప్పర్ సియాంగ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ శుక్రవారం కూలిపోయింది. ప్రమాదం జరిగిన మిగ్గింగ్ గ్రామం అటవీ ప్రాంతమని అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం లేకపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యమవుతోందని వివరించారు. ఇప్పటికే ఓ సహాయక బృందాన్ని ప్రమాద స్థలానికి పంపించినట్లు పేర్కొన్నారు.
అయితే, ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ఎంతమంది ఉన్నారనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉందని పేర్కొన్నారు. ఇటీవలే కేదార్ నాథ్ లో హెలికాప్టర్ కూలిన విషయం తెలిసిందే. గాల్లోకి లేచిన కొన్ని క్షణాలలోనే హెలికాప్టర్ కూలిపోవడంతో పైలట్ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, అక్టోబర్ నెల ప్రారంభంలో ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో పైలట్ మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి.