YSRCP: జగన్ తో ధర్మాన ప్రసాదరావు భేటీ... జనసేన ఆరోపణలపై వివరణ ఇచ్చిన రెవెన్యూ మంత్రి
- విశాఖ పర్యటనలో ధర్మానపై విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్
- శుక్రవారం తాడేపల్లిలో సీఎం జగన్ తో సమావేశమైన ధర్మాన
- భూ ఆక్రమణల్లో తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని వివరణ
- భూ ఆక్రమణలపై సిట్ నివేదికను ప్రస్తావిస్తూ వివరణ ఇచ్చిన మంత్రి
విశాఖ పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన పలు ఆరోపణలు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఇరుకున పెట్టేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే ఆక్రమించిన భూములను పేదలకు పంచాలని పవన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై బయట పెద్దగా స్పందించని ధర్మాన... శుక్రవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రం వివరణ ఇచ్చారు.
శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ధర్మాన... సీఎంతో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన భూ ఆక్రమణల ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. భూ ఆక్రమణలకు సంబంధించి సిట్ నివేదికలోని పలు అంశాలను ప్రస్తావించిన ధర్మాన... భూ ఆక్రమణల్లో జనసేన తనపై చేసిన ఆరోపణలో వాస్తవం లేదని వివరించారు.