Telangana: ఏడ్చే మగాడిని...కాంగ్రెస్ వారిని నమ్మవద్దు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలంటూ కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసిన వెంకట్ రెడ్డి
- వైరల్ గా మారిన ఆడియోపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి
- తన సోదరుడిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు
- టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కయిందని ఆరోపణ
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం వైరి వర్గాలపై పదునైన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిెందే.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడినా... ఆయన సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఉప ఎన్నికల్లో పార్టీలను పక్కనపెట్టి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలంటూ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేశారు. ఈ ఫోన్ కాల్ ఆడియో బయటకు వచ్చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై వెంకట్ రెడ్డి స్పందించకున్నా... రాజగోపాల్ రెడ్డి మాత్రం స్పందించారు.
తన సోదరుడు వెంకట్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ రాజగోపాల్ రెడ్డి... తన సోదరుడు ప్రజల కోసం కష్టపడే వ్యక్తి అన్నారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కయిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి సీఎం కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారన్నారు. ఏడ్చే మగాడిని.. కాంగ్రెస్ పార్టీ వారిని నమ్మవద్దని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కుమార్తె కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.