YSRCP: జగన్ అక్రమాస్తుల కేసు నుంచి ఇండియా సిమెంట్స్ కు ఊరట... వీడీ రాజగోపాల్ పిటిషన్ కొట్టివేత
- జగన్ అక్రమాస్తుల కేసు నిందితుల జాబితాలో ఇండియా సిమెంట్స్, వీడీ రాజగోపాల్
- తమను ఈ కేసు నుంచి తప్పించాలంటూ వేర్వేరుగా క్వాష్ పిటిషన్ల దాఖలు
- ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శుక్రవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నుంచి ఇండియా సిమెంట్స్ ను తప్పిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. అదే సమయంలో ఉమ్మడి ఏపీ గనుల శాఖ విశ్రాంత డైరెక్టర్ వీడీ రాజగోపాల్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో తమకేమీ సంబంధం లేదని, దీంతో ఈ కేసు చార్జిషీట్ లో నుంచి తమను తొలగించాలంటూ ఇండియా సిమెంట్స్, వీడీ రాజగోపాల్ లు వేర్వేరుగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఇండియా సిమెంట్స్ వాదనతో ఏకీభవించి ఆ సంస్థ పేరును చార్జిషీట్ నుంచి తొలగించింది. అదే సమయంలో వీడీ రాజగోపాల్ కు ఈ కేసుతో సంబంధం ఉందని అభిప్రాయపడ్డ కోర్టు... ఆయన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది.