Telangana: శాకాహారానికి గుడ్ బై... తెలంగాణలో 100 శాతానికి చేరువైన మాంసాహార వినియోగం
- జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆసక్తికర అంశాలు
- తెలంగాణలో 97 శాతం దాటిన మాంసాహారుల సంఖ్య
- 4.4 శాతం మంది కోడి గుడ్లతో మాంసాహారులుగా కొనసాగుతున్న వైనం
- దేశంలో సగటు మాంసాహారుల శాతం 51
దేశంలో కొత్త రాష్ట్రం తెలంగాణలో మాంసాహారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మరో నాలుగైదేళ్లు పోతే రాష్ట్రంలో శాకాహారి మాటే వినిపించనంతగా ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో శాకాహారుల శాతం 2.7 శాతమే. మిగిలిన 97.3 శాతం మంది తెలంగాణ ప్రజలు మాంసాహారులేనట. ఈ మేరకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్) నివేదిక తెలిపింది. 2019- 2021 మధ్య ఈ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దేశంలో సగటు మాంసాహారుల శాతం 51 ఉండగా... అది తెలంగాణకు వచ్చేసరికి ఏకంగా 97.3 శాతానికి పెరగడం గమనార్హం.
ఇక తెలంగాణలోని మాంసాహారుల్లో 73 శాతం మంది వారానికి కనీసం ఒక్కసారైనా మాంసాహారాన్ని తీసుకుంటున్నారట. అదే సమయంలో 4.4 శాతం మంది మాత్రం మటన్, చికెన్, చేపలను మినహాయించి కోడి గుడ్లతో పని కానిచ్చేస్తున్నారట. ఈ తరహా మార్పులకు కారణం కరోనా విజృంభణేనని ఈ సర్వే చెబుతోంది. కరోనా నుంచి రక్షణ కొరకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో అప్పటిదాకా మాంసాహారం ముట్టని వారు కూడా శాకాహారానికి గుడ్ బై చెప్పేశారట.