Anees Ansari: స్కూల్లో ఉన్న చిన్నారులను చంపేందుకు యత్నించిన సైబర్ టెర్రరిస్టుకు జీవితఖైదు
- ఐసిస్ ప్రభావానికి లోనైన కంప్యూటర్ ఇంజినీర్ అన్సారీ
- ముంబయిలోని అమెరికన్ స్కూల్ ను టార్గెట్ చేసిన వైనం
- కుట్రను భగ్నం చేసిన పోలీసులు
- 2014లో అరెస్ట్.. దోషిగా నిర్ధారించిన కోర్టు
దేశంలో సైబర్ టెర్రరిజంకు సంబంధించిన కేసులో ఓ వ్యక్తికి జీవితఖైదు పడింది. సైబర్ టెర్రరిజం కేసుల్లో శిక్ష పడడం దేశంలో ఇదే ప్రథమం. ఆ వ్యక్తి పేరు అనీస్ అన్సారీ. 32 ఏళ్ల అన్సారీ ఓ కంప్యూటర్ ఇంజినీర్.
2014లో ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద అమెరికన్ స్కూల్లో చిన్నారులను బాంబు దాడి చేసి చంపేందుకు యత్నించాడని అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఆరోపణలు నిర్ధారణ కావడంతో కోర్టు అతడికి జీవితఖైదు విధించింది.
ముంబయిలోని అమెరికన్ స్కూల్లో విదేశీయులకు చెందిన పిల్లలు విద్యాభ్యాసం చేస్తుంటారు. వారిని హతమార్చితే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించవచ్చన్న ఉద్దేశంతో అతడు కుట్ర పన్నినట్టు వెల్లడైంది. తన ఉగ్ర ప్రణాళికలో భాగంగా అనీస్ అన్సారీ థర్మైట్ బాంబును సిద్ధం చేసుకున్నాడని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
తాను పనిచేసే కంపెనీ కంప్యూటర్ ను, ఇంటర్నెట్ ను దుర్వినియోగం చేసి, ఉసైరిమ్ లోగాన్ అనే నకిలీ ఐడీతో ఒమర్ ఎల్హాజీ అనే వ్యక్తితో చాటింగ్ చేస్తూ బాంబు తయారీ విధానాలను నేర్చుకున్నాడని దర్యాప్తు నివేదికలో తెలిపారు.
అతడిని 2014 అక్టోబరు 18న అరెస్ట్ చేయగా, అప్పటినుంచి జైల్లోనే ఉన్నాడు. అన్సారీపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66 (ఎఫ్) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన సెషన్స్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
అతడు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రభావంతో ఉగ్రచర్యలకు పాల్పడేందుకు యత్నించాడన్న విషయం నిర్ధారణ అయిందని, ఉగ్ర సంస్థల్లో చేరేలా యువతకు ఉద్బోధ చేశాడని జస్టిస్ జోగ్లేకర్ ధర్మాసనం పేర్కొంది.