Fire Accident: విజయవాడలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం
- బాణసంచా దుకాణంలో చెలరేగిన మంటలు
- జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన దుకాణలు బుగ్గి
- నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేసిన అగ్నిమాపక శాఖ సిబ్బంది
- పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో భయంతో స్థానికుల పరుగులు
దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలకు నిప్పంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. మొత్తం పదిహేను దుకాణాలకు మంటలు వ్యాపించగా.. ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో ఆదివారం ఉదయం ఈ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతికష్టమ్మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈలోపే కొన్ని దుకాణాలు బూడిదకుప్పలుగా మారగా.. మరికొన్ని పాక్షికంగా కాలిపోయాయి.
దీపావళి నేపథ్యంలో విజయవాడలోని గాంధీనగర్ జింఖానా గ్రౌండ్స్‌లో 20 బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఓ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. బాణసంచాకు నిప్పంటుకోవడంతో చుట్టుపక్కల దుకాణాలకూ మంటలు వ్యాపించాయి. భారీ శబ్దాలతో పేలుళ్లు, ఉవ్వెత్తున్న ఎగిసిపడ్డ మంటలను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో జింఖానా గ్రౌండ్స్ కు చేరుకుని మంటలను ఆర్పేశారు.
అప్పటికే పదిహేను దుకాణాలకు మంటలు వ్యాపించాయి. అందులో కొన్ని పూర్తిగా కాలిబూడిదయ్యాయని, ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనమయ్యారని పోలీసులు చెప్పారు. కాగా, జింఖానా గ్రౌండ్స్ పక్కనే పెట్రోల్ బంక్ ఉందని, గ్రౌండ్ లో బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఎలా ఇచ్చారని అధికారులను స్థానికులు నిలదీస్తున్నారు. పెట్రోల్ బంక్ కు మంటలు వ్యాపించి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.