Xi Jinping: చైనాలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న షీ జిన్ పింగ్
- ముగిసిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్
- పార్టీ జనరల్ సెక్రటరీగా మరోసారి జిన్ పింగ్
- నేడు ప్రకటన వెలువడే అవకాశం
- మూడోసారి అధ్యక్ష బాధ్యతలు
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తనకు చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగు లేదని నిరూపించుకున్నారు. ముచ్చటగా మూడోసారి చైనా అధ్యక్ష స్థానంలో ఆసీనులు కానున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 69 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం 70 ఏళ్ల తర్వాత పాలించడానికి లేదు. కానీ, మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతుడిగా జిన్ పింగ్ నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో మరో ఐదేళ్ల పాటు తానే పాలించేందుకు వీలుగా 2018లోనే పార్టీ రాజ్యాంగంలో మార్పులకు శ్రీకారం చుట్టారు.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ శనివారంతో ముగిసింది. పార్టీ జనరల్ సెక్రటరీగా జిన్ పింగ్ నియామకంపై నేడు ప్రకటన వెలువడనుంది. ఐదేళ్లకోసారి చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ జరుగుతుంటుంది. ఈ సందర్భంగా తదుపరి నేతను ఎన్నుకుంటారు. జనరల్ సెక్రటరీగా జిన్ పింగ్ నియామకంపై ప్రకటన వెలువడితే, మూడో సారి చైనా అధ్యక్షుడు కావడానికి లైన్ క్లియర్ అయినట్టే.
2,300 మంది పార్టీ ప్రతినిధులు జిన్ పింగ్ పాలన నివేదికను కాంగ్రెస్ లో భాగంగా ఆమోదించారు. పార్టీకి ఆయన పాలన ప్రధానమని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు చైనా భవిష్యత్తు అభివద్ధిని నడిపించే సూత్రాలని కొనియాడారు. నూతన సెంట్రల్ కమిటీ 25 మంది సభ్యులతో పొలిట్ బ్యూరోను ఎన్నుకుంటుంది. తిరిగి అది ఏడుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంటుంది. జిన్ పింగ్ మిత్రులతో స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారని అంచనా. అధ్యక్షుడు షీ జిన్ పింగ్ పాలనా విధానాలు, జీరో కొవిడ్ పాలసీని వ్యతిరేకిస్తూ చైనా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన వ్యక్తమవడం ఈ విడత అందిరినీ ఆలోచనకు గురిచేసింది. జిన్ పింగ్ పదవీచ్యుతుడు అవుతారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ, అవేమీ నిజం కాలేదు.