Yanamala: రాష్ట్రం అభివృద్ధి కావాలంటే జగన్ ప్రభుత్వాన్ని దించాలి: యనమల
- ప్రభుత్వ అప్పులు పెరిగిపోయాయని వెల్లడి
- తప్పులు కప్పిపుచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారని విమర్శలు
- యువత భవిష్యత్తును అగమ్య గోచరంలోకి నెట్టారని వెల్లడి
- వీడియో సందేశం వెలువరించిన యనమల
వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో చేసిన తప్పుల్ని, అప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
చేసిన అవినీతి మరకలను తుడుచుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కిందా మీదా పడుతోందని విమర్శించారు. సంక్షేమం అనేది పథకాల పేరులో ఉందే తప్ప ఆచరణాత్మకంగా కనబడడంలేదని అన్నారు.
"ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రంలో పేదరికం పెరుగుతోంది. తెచ్చిన అప్పులు స్వార్థానికి వాడుకుంటున్నారు. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. అప్పుడే భవిష్యత్తులో రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశాలుంటాయి. అసెంబ్లీ ఆమోదించిన లెక్కల ప్రకారం మూడున్నర సంవత్సరాల్లో దాదాపు రూ.1,96,165 కోట్లు అప్పు చేశారు. అసెంబ్లీ ఆమోదించిన దాని కంటే ఎక్కువ అప్పులు చేశారు. ఇవన్నీ కాగ్ రిపోర్టులో చాలా స్పష్టంగా ఉన్నాయి.
ప్రభుత్వానికి ఇంత అప్పు చేసే అర్హత లేదు. ఏ విధంగా ఇంత పెద్ద మోతాదులో అప్పు చేశారో తెలియదు. వీరు చేసిన అప్పులకు లెక్కా పత్రం లేదు. కాగ్ కి తప్పుడు సమాచారం చెబుతున్నారు. చేసిన ఖర్చు వివరాలు తెలపలేకున్నారు. వీరి అవినీతి బయట పడతుందని భయంతో దాస్తున్నారు.
ఏ తప్పు చేయనివారైతే కాగ్ కి, సీఐజీకి ఎందుకు రిపోర్టు ఇవ్వడంలేదు? శ్వేతపత్రం విడుదల చేయమంటే ఎందుకు చేయడంలేదు? యువకుల భవిష్యత్తును అగమ్యగోచరంలోకి నెట్టిన ఘనుడు జగన్. నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో రెవెన్యూ లోటు 148 శాతం పెరిగింది. ద్రవ్యలోటు 208 శాతం పెరిగింది. మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.
ఆదాయ వనరులు లేవు. జీఎస్టీ పెరగలేదు. రెవెన్యూ లేదు, అప్పులు పెరిగాయి. తలసరి ఆదాయం డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్ కు వచ్చింది. ఇలాంటి ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదు.
దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు తప్ప ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడంలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’’అని యనమల రామకృష్ణుడు తెలిపారు.