CP Srikanth: పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదు: సీపీ శ్రీకాంత్

Visakha CP Srikanth says police did not harass Pawan Kalyan

  • ఇటీవల విశాఖ వచ్చిన పవన్ కల్యాణ్ 
  • ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తతలు
  • కుట్ర ప్రకారమే ఎయిర్ పోర్టులో దాడి జరిగిందన్న పోలీసులు
  • పవన్ ర్యాలీకి అనుమతి లేదన్న సీపీ
  • పవన్ పర్యటనకు మాత్రమే అనుమతి ఉందని వెల్లడి

ఇటీవల విశాఖపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదని నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ నెల 15న విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన తర్వాత పరిణామాలపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. 

కొందరి సామాజిక మాధ్యమాల అకౌంట్లను, వ్యక్తులను గుర్తిస్తున్నామని వెల్లడించారు. అసత్య ప్రచారాలతో శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులపై జనసేన నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని స్పష్టం చేశారు. 

కుట్ర ప్రకారమే ఎయిర్ పోర్టులో దాడి జరిగినట్టు విచారణలో తేలిందని సీపీ చెప్పారు. మంత్రి రోజాపై దాడి చేయాలనుకున్నారు గానీ, ఆమె పీఏకు గాయమైందని తెలిపారు. ఆ రోజున విశాఖలో పవన్ పర్యటనకు అనుమతి ఉంది కానీ, ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. డీజే, భారీ జనసమీకరణ, డ్రోన్ల వినియోగానికి అనుమతి లేదని వివరించారు. 

ర్యాలీకి అనుమతి లేదని, విరమించుకోవాలని కోరితే వినలేదని సీపీ శ్రీకాంత్ వెల్లడించారు. విశాఖలో నాలుగు గంటల పాటు రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయిందని, విమాన ప్రయాణికులు, సామాన్యులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని తెలిపారు. 

పెందుర్తి సీఐ గాయపడ్డారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని అన్నారు. ఈ ఘటనపై 6 వేర్వేరు కేసులు నమోదు చేశామని, 100 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News