Diwali: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

Telugu states CMs wishes people on Diwali
  • రేపు దీపావళి
  • చీకటిపై వెలుగు సాధించిన విజయం అని సీఎం జగన్ వెల్లడి
  • ప్రజల జీవితాల్లో ఆనంద కాంతులు నిండాలని ఆకాంక్ష
  • దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ కేసీఆర్ స్పందన
రేపు (అక్టోబరు 24) దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఏపీ సీఎం జగన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా దీపావళి జరుపుకుంటామని వివరించారు. 

ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. దీపావళి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో విరాజిల్లాలని అభిలషించారు.

అటు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ, దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ పండుగ జరుపుకుంటామని తెలిపారు. 

అజ్ఞాన అంధకారాన్ని పారదోలి జ్ఞానపు కాంతులు విరజిమ్మాలనే తత్వాన్ని దీపావళి చాటుతుందని కేసీఆర్ వివరించారు. తెలంగాణ తరహాలోనే దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి వెలుగులు నిండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Diwali
Jagan
KCR
Andhra Pradesh
Telangana

More Telugu News