Team India: కోహ్లీ.. నీ కోసం బుల్లెట్ కైనా ఎదురు నిలబడాలనుకున్నా: హార్దిక్ పాండ్యా
- పాకిస్థాన్ పై కోహ్లీతో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన పాండ్యా
- మ్యాచ్ తర్వాత కోహ్లీతో కలిసి బీసీసీఐ టీవీతో మాట్లాడిన హార్దిక్
- 19వ ఓవర్లో విరాట్ కొట్టిన సిక్సర్లు అద్భుతం అని ప్రశంస
టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ పై భారత్ ఉత్కంఠ విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ హీరోగా నిలిచాడు. ఓ దశలో 31/4తో కష్టాల్లో పడ్డ జట్టును అతను విజయతీరాలకు చేర్చాడు. హార్దిక్ పాండ్యాతో ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విరాట్ జట్టును అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఘన విజయంలో కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా పాత్ర కూడా చాలానే ఉంది. కీలక సమయంలో అతను కోహ్లీకి గొప్ప సహకారం అందించాడు. మొదట దూకుడుగా ఆడిన హార్దిక్ తర్వాత కోహ్లీ జోరు చూసి అతనికి ఎక్కువ స్ట్రయిక్ వచ్చేలా చూసుకున్నాడు. ఈ విజయం బీసీసీఐ టీవీ కోసం కోహ్లీతో మాట్లాడాడు.
భారత కెప్టెన్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం ఎలా ఉంటుందో వివరించాడు. అలాగే, ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో హరీస్ రవూఫ్ బౌలింగ్ లో వరుసగా సిక్సర్లు బాదిన కోహ్లీపై హార్దిక్ ప్రశంసలు కురిపించాడు. తాను బుల్లెట్ కు ఎదురెళ్లయినా సరే కోహ్లీని ఔట్ కానివ్వకుడదని అనుకున్నట్లు వెల్లడించాడు. ‘విరాట్ కొట్టిన రెండు షాట్లు ఎంత ముఖ్యమైనవో నాకు తెలుసు. అందులో ఒక్క షాట్ మిస్సయినా మనం ఆటలో వెనుకబడిపోయే వాళ్లం. ఇది వరకు నేను చాలా సిక్సర్లు కొట్టాను. కానీ ఈ రెండు సిక్సర్లు చాలా స్పెషల్. వాటిని కోహ్లీ తప్ప వేరే ఎవ్వరూ కొట్టలేరని అనుకుంటున్నా. ఈ మ్యాచ్ లో మేం కొన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాం. కానీ, కలిసికట్టుగా జట్టును గెలిపించాం. మనం క్రీజులోకి వచ్చి ఇలాంటి అసాధారణమైన షాట్లు ఆడకపోయి ఉంటే ఈ విజయం ఇంత ప్రత్యేకం అయ్యేది కాదు. చాలా కష్టపడి గెలిచాం కాబట్టి నాకు మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. వాళ్లు బాగా బౌలింగ్ చేశారు. చివరి దాకా అద్భుతంగా పోరాడారు’ అని హార్దిక్ చెప్పాడు.
ఇక, కోహ్లీతో కీలక భాగస్వామ్యం నమోదు చేస్తున్న క్రమంలో తాను ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధం అయ్యానని పాండ్యా చెప్పాడు. ‘విరాట్ నీ కోసం నేను బుల్లెట్ కు ఎదురెళ్లేందుకైనా సిద్ధపడ్డా. అంతే తప్ప నిన్ను ఔట్ కానివ్వకూడదని అనుకున్నా. నా గోల్ చాలా సింపుల్.. క్రీజులో నిన్ను సౌకర్యవంతంగా ఉంచాలనుకున్నా. అదే చేశా. ఇలాంటి మ్యాచ్ ల్లో నువ్వు ఎన్నో సార్లు జట్టును గెలిపించావు. ఒత్తిడిని చిత్తు చేయడంలో నిన్ను మించిన వాళ్లు లేరు’ అని కోహ్లీకి పాండ్యా చెప్పాడు.