NT Ramarao: ఎన్టీఆర్ .. ఏఎన్నార్ నన్ను దూరం పెట్టలేదు: సీనియర్ నటుడు నరసింహా రాజు
- నిన్నటితరం కథానాయకుడిగా నరసింహారాజు
- జానపద చిత్రాల ద్వారా ఎక్కువ గుర్తింపు
- విఠలాచార్య - దాసరి ప్రోత్సహించారంటూ వెల్లడి
- తనపై ఎన్టీఆర్ కీ .. ఏఎన్నార్ కి కోపం ఉండేది కాదంటూ స్పష్టీకరణ
తెలుగులో ఎన్టీఆర్ .. కాంతారావు తరువాత జానపద కథా చిత్రాల పరంగా ఎక్కువ పేరు సంపాదించుకున్న నటుడు నరసింహారాజు. హీరోగా అనేక సినిమాలలో నటించిన ఆయన ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఒకానొక దశలో ఆయన ఎక్కువగా సీరియల్స్ చేశారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు.
సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తరువాత నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా సమయం పట్టింది. అందువలన ఆ సమయంలో నాకు గ్యాప్ వచ్చింది. జానపద చిత్రాలలో .. అందునా విఠలా చార్య దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం, నా పట్ల ఆయనకి గల అభిమానం. ఆ తరువాత నన్ను ఎక్కువగా ప్రోత్సహించింది దాసరి నారాయణగారు.
నా నోటి దురుసుతనం వలన ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లను ఏదో అన్నాననీ, అందువలన వాళ్లకి కోపం రావడంతో నన్ను సినిమాలకి దూరం పెట్టారనే ప్రచారం వుంది. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఏమీ తెలియని వయసులో నేనన్న మాటను పత్రికల వారు మరో రకంగా రాయడం వలన గందరగోళమైపోయింది. అంతేగానీ నాపై వారేం కోప్పడలేదు. ఆ సంఘటన తరువాత ఎన్టీఆర్ గారు నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం .. ఏఎన్నార్ గారితో నేను కలిసి నటించడమే అందుకు నిదర్శనం" అంటూ చెప్పుకొచ్చారు.