Rapolu Anand Bhaskar: రెండు, మూడు రోజుల్లో టీఆర్ఎస్ లో చేరనున్న రాపోలు ఆనంద భాస్కర్
- ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన రాపోలు
- నేతన్నల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను ప్రశంసించిన వైనం
- చేనేత పరిశ్రమను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శ
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీని టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కూడా టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. నిన్ననే ఆయన ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను, పరిశ్రమ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు.
చేనేత ఉత్పత్తులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధిస్తుండటాన్ని ఆయన విమర్శించారు. చేనేత పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఈ క్రమంలో బీజేపీలో చేరేందుకు ఆయన సుముఖతను వ్యక్తపరిచారు. అంతా ఓకే అయితే రెండు, మూడు రోజుల్లోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.