Mumbai: బాంబులు కాల్చొద్దన్న యువకుడు.. కత్తితో పొడిచి చంపిన మైనర్లు

Three Boys Killed young man in mumbai over Crackers issue
  • ముంబైలోని శివాజీ నగర్‌లో ఘటన
  • గ్లాస్ బాటిల్‌లో టపాసులు ఉంచి పేలుస్తున్న బాలుడు
  • బాటిల్ పగిలి ముక్కలు గుచ్చుకుంటాయని వారించిన యువకుడు
  • సోదరుడు, అతడి స్నేహితుడితో కలిసి యువకుడిపై దాడికి దిగిన బాలుడు
  • యువకుడిని కత్తితో పొడిచిన బాలుడి సోదరుడు
గ్లాసు బాటిల్‌లో బాంబులు కాల్చడం వల్ల వాటి ముక్కలు అందరికీ గుచ్చుకునే ప్రమాదం ఉందని, కాబట్టి వాటిని కాల్చొద్దన్న యువకుడిని ముగ్గురు బాలురు కత్తితో పొడిచి చంపారు. ముంబైలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శివాజీ నగర్‌కు చెందిన 12 ఏళ్ల బాలుడు గ్లాసు బాటిల్‌లో టపాసులు ఉంచి పేలుస్తున్నాడు. గమనించిన పొరిగింటి యువకుడు సునీల్ శంకర్ నాయుడు (21) వద్దని వారించాడు. అది చాలా ప్రమాదమని, గ్లాసు పేలి దాని ముక్కలు అందరికీ గుచ్చుకుంటాయని, కాబట్టి వద్దని వారించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

గొడవను చూసిన బాలుడి అన్న (15), అతడి స్నేహితుడు (14) అక్కడికొచ్చారు. ముగ్గురూ కలిసి శంకర్‌తో గొడవకు దిగారు. అనంతరం ఆగ్రహంతో అతడిపై దాడిచేశారు. బాలుడి అన్న కత్తితో శంకర్ పొట్టలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన శంకర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి అన్న, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు కారణమైన బాలుడు పరారీలో ఉన్నాడు.
Mumbai
Diwali
Crime News
Murder

More Telugu News