Congress: నా జీవితంలో ముఖ్యమైన రోజు ఇది: ఖర్గే

Mallikarjun Kharge Addresses Party Leaders After Taking Congress Charge

  • కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తొలి ప్రసంగం
  • తనపై విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపిన ఖర్గే
  • పార్టీ అధ్యక్ష పదవి చాలా పెద్ద బాధ్యత అని వ్యాఖ్య
  • ఒక కార్మికుడి కొడుకు ఇలా పార్టీ బాధ్యతలు చేపట్టడం ఊహించలేమని వెల్లడి

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఈ రోజు తనకు ఎంతో ముఖ్యమైనదని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే పార్టీ 98వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. తనమీద విశ్వాసం ఉంచి పార్టీ అధ్యక్షుడిగా గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలతో పాటు సోనియా గాంధీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. ఒక కార్మికుడి కొడుకు, పార్టీ సాధారణ కార్యకర్త ఈరోజు ఇలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం కలలో కూడా ఊహించలేమని ఖర్గే భావోద్వేగానికి లోనయ్యారు. తన అనుభవంతో కాంగ్రెస్ పార్టీని ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు అహర్శిశలూ కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ను కాపాడుకోవడం, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం మనందరి ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ వారసత్వాన్ని..
కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వించదగ్గ విషయమని ఖర్గే పేర్కొన్నారు. సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు. దేశ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్‌ తో లక్షలాది మంది కలిసి నడుస్తున్నారని తెలిపారు. రాహుల్‌ భారత్ జోడో యాత్ర లక్ష్యాన్ని వృధా కానివ్వబోమని ఖర్గే ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం.. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా పెద్ద బాధ్యతని పేర్కొన్నారు. ఇంతకాలం తాను చిత్తశుద్ధితో తన విధులను నిర్వర్తించానని, ఇప్పుడు ఖర్గే కూడా అదేవిధంగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.

  • Loading...

More Telugu News