KTR: హైదరాబాద్ లో అందుబాటులోకి మరో ఫ్లైఓవర్

Minister KTR inaugurated flyover in nagole

  • నాగోల్–సికింద్రాబాద్ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
  • ఆరు లేన్లు, 990 మీటర్ల పొడవుతో నిర్మాణం 
  • ఎస్ఆర్ డీపీలో భాగంగా 143.58 కోట్ల ఖర్చుతో పూర్తి

హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తప్పించేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్ లో దాదాపు రూ.143.58 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫ్లైఓవర్ ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ ఎంసీ సంయుక్తంగా చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్ ఆర్ డీపీ)లో భాగంగా నిర్మించిన ఆరు లైన్ల ఈ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవు ఉంది. నాగోల్–సికింద్రాబాద్ మార్గంలో ఉన్న ఈ ఫ్లైఓవర్ ను 143.58 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. 

నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. నగరంలో సరైన మౌలిక వసతులు కల్పించకపోతే బెంగళూరు మాదిరిగా ఇక్కడి ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ట్రాఫిక్ రద్దీ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఎస్ఆర్ డీపీ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే రూ. 8052 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టామని కేటీఆర్ వెల్లడించారు. ఎస్ ఆర్ డీపీ కింద నగరంలో ఇప్పటి వరకూ 32 ప్రాజెక్టులు పూర్తయ్యాయని వెల్లడించారు.  మరో 16 ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనే 16 ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. రెండవ దశలో 12 ప్రాజెక్టులను చేపడతామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News