Debby Shwartz: పేరు కూడా లేని వింత జబ్బుతో బాధపడుతున్న బ్రిటన్ మహిళ
- 47 ఏళ్ల డెబ్బీ ష్వార్ట్జ్ దుర్భర గాథ
- ఎన్ని ఆసుపత్రులు తిరిగినా జబ్బేంటో తెలియని వైనం
- వైద్య పరీక్షల్లో అన్నీ నార్మల్
- డాక్టర్లకే అంతుబట్టని డెబ్బీ ఆరోగ్య పరిస్థితి
బ్రిటన్ కు చెందిన డెబ్బీ ష్వార్ట్జ్ అనే మహిళ ఓ వింత జబ్బుతో బాధపడుతోంది. ఈ అరుదైన రుగ్మత ఏంటన్నది వైద్య నిపుణులకు కూడా అంతుబట్టడంలేదు. అసలు, ఈ జబ్బుకు పేరు కూడా లేదు.
డెబ్బీ వయసు 47 సంవత్సరాలు. ఆమె ఎప్పుడూ వీల్ చెయిర్ లోనే ఉంటుంది. బాల్యం నుంచే ఆమెకు ఇదే పరిస్థితి. తలలోనే లోపం ఉన్నట్టుంది... అందుకు నువ్వేం చేస్తావు అని తల్లిదండ్రులు ఆమెను సముదాయించేవారు. ఆమె చెప్పే సమస్యలు విన్న డాక్టర్లు అదేం జబ్బో చెప్పలేకపోయారు. వైద్య పరీక్షలు చేస్తే ఎలాంటి లోపం కనిపించేది కాదు... కానీ ఆమె బాధకు కారణం ఏంటన్నది పేరుమోసిన వైద్య నిపుణులు సైతం చెప్పలేకపోయారు.
వయసు పైబడే కొద్దీ అనారోగ్య సమస్యలు తీవ్రం అయ్యాయి. ఆమె ఎన్ని ఆసుపత్రులకు తిరిగిందో లెక్కేలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ డెబ్బీ బయోకెమిస్ట్రీ సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణురాలైంది. టీచర్ కావాలన్నది ఆమె కల... అందుకు అర్హత కూడా సంపాదించింది. కానీ అరుదైన జబ్బు కారణంగా ఆమె ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించలేకపోయింది.
2000 సంవత్సరంలో డెబ్బీ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. దాంతో 10 నెలల పాటు ఆసుపత్రిలోనే ఉంది. అప్పటినుంచి నడవడం కాదు కదా, కనీసం చిన్న పని కూడా చేయలేని స్థితికి ఆమె ఆరోగ్యం దిగజారింది.
ఇక 2005లో కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేసి మైటోకాండ్రియల్ జబ్బుతో బాధపడుతున్నట్టు కొద్దిమేర గుర్తించారు. దేహంలోని కొన్ని కీలక భాగాల కణాలు లోపభూయిష్టంగా తయారవడమే ఈ మైటోకాండ్రియల్ జబ్బు లక్షణం. ఆ తర్వాత కాలంలో ఆమె మరిన్ని అనారోగ్య సమస్యలకు గురికావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆమె బాధపడుతున్నది మైటోకాండ్రియల్ జబ్బుతోనే అని చెప్పలేని పరిస్థితి తలెత్తింది.
మానసిక సమస్యలు, శారీరక రుగ్మతలు, వ్యాధినిరోధక శక్తి సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు డెబ్బీని చుట్టుముట్టాయి. వినికిడి లోపంతో పాటు కంటిచూపు కూడా మందగించింది. మోకాళ్లు పెళుసుగా తయారయ్యాయి... చేతులు బలహీనంగా మారిపోయాయి. ఇలా ఒకటీ రెండు కాదు... అనేక సమస్యలు డెబ్బీని కబళించేందుకు సిద్ధమయ్యాయి.
ఇప్పుడామెకు ఒకటే ఆశ. పేరు కూడా లేని అరుదైన జబ్బులతో బాధపడే రోగుల కోసం బ్రిటన్ లో ప్రత్యేక క్లినిక్ నెలకొల్పారు. ఆ క్లినిక్ లో తన జబ్బుకు మూల కారణం ఏంటో తెలుసుకునే పరీక్షలు చేస్తారని, తద్వారా తన జబ్బుకు చికిత్స లభిస్తుందని డెబ్బీ నమ్ముతోంది.
ఈ క్లినిక్ వేల్స్ లోని కార్డిఫ్ యూనివర్సిటీ ఆసుపత్రిలో నెలకొల్పారు. ఈ క్లినిక్ అధిపతి డాక్టర్ గ్రాహమ్ షార్ట్ లాండ్ మాట్లాడుతూ, ఇలాంటి అరుదైన జబ్బుల ప్రభావం రోగులపైనే కాకుండా, వారి కుటుంబ సభ్యులపైనా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కనీసం పేరు కూడా లేని సిండ్రోమ్ లను గుర్తించడానికే సగటున నాలుగేళ్ల సమయం పడుతుందని తెలిపారు. ఒక్కసారి వ్యాధి నిర్ధారణ అయితే, రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఊరట కలుగుతుందని పేర్కొన్నారు. రోగులకు ప్రత్యేక వైద్య నిపుణులతో చికిత్స అందించేందుకు మార్గం సుగమం అవుతుందని డాక్టర్ గ్రాహమ్ వివరించారు.
కాగా, ప్రపంచంలో ప్రతి ఏడాది 6 వేలమంది చిన్నారులు పేరులేని జబ్బులతో జన్మిస్తుండగా, ఒక్క బ్రిటన్ లో ఇలాంటి వారు 3.5 లక్షల మంది ఉన్నారు. దురదృష్టం కొద్దీ వారిలో చాలామంది ఐదేళ్ల వయసు వచ్చేసరికి ప్రాణాలు కోల్పోతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.