RRR: విదేశీయులను 'ఆర్ఆర్ఆర్' ఆకట్టుకోవడానికి ఆ రెండు విషయాలే కారణం: రాజమౌళి
- ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా మార్చిలో విడుదలైన 'ఆర్ఆర్ఆర్'
- ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సొంతం
- హీరోయిజం, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయన్న రాజమౌళి
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించి 'ఆర్ఆర్ఆర్' విడుదలై ఆరు నెలలు దాటినా ప్రపంచ వ్యాప్తంగా ఆ చిత్రం హవా నడుస్తూనే ఉంది. భారత్ తో పాటు అన్ని దేశాల అభిమానులు ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ మధ్యే ఈ చిత్రం జపాన్ లో కూడా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. 'ఆర్ఆర్ఆర్'కి వచ్చిన గొప్ప స్పందన గురించి గురించి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నిర్దయతో కూడిన హీరోయిజం, భారీ యాక్షన్ సన్నివేశాల వల్లే ఈ చిత్రం అన్ని హద్దులూ చెరిపేసి ప్రపంచాన్ని మెప్పించగలిగిందని చెప్పారు.
ఈ పీరియాడికల్ డ్రామాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించారు. విదేశీ అభిమానుల నుంచి 'ఆర్ఆర్ఆర్'కి వచ్చిన విపరీతమైన స్పందన తనను ఆశ్చర్యపరిచిందని రాజమౌళి అన్నారు. హీరోయిజం వల్లే ఈ చిత్రం అడ్డంకులను అధిగమించగలిగిందన్నారు. అలాగే, తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి సహాయపడ్డాయని ఆయన చెప్పారు. ‘భారత ప్రజలు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. భారతీయ ప్రేక్షకులు ఉన్న చోట సినిమాకు మంచి స్పందన వస్తుందని నేను భావించా. కానీ విదేశీయుల నుంచి ఇంత గొప్ప ఆదరణ రావడం ప్రారంభమైంది. ఇది నేను అస్సలు ఊహించలేదు’ అని అన్నారు.