Bollywood: తెలుగు గడ్డపై పుట్టి బాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా వెలుగొందిన ఇస్మాయిల్ ష్రాఫ్ ఇకలేరు
- అనారోగ్యంతో బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన ష్రాఫ్
- కర్నూలులో జన్మించిన ఇస్మాయిల్ ష్రాఫ్
- ఆయన మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖుల సంతాపం
తెలుగు గడ్డపై పుట్టి బాలీవుడ్ ఎన్నో చిత్రాలు రూపొందించిన వెటరన్ దర్శకుడు ఇస్మాయిల్ ష్రాఫ్ (62) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇస్మాయిల్ నెల రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి చనిపోయారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నటులు గోవిందా, పద్మిని కొల్హాపురి, అశోక్ పండిట్ తదితరులు ఆయనకు నివాళులర్పించారు.
ఇస్మాయిల్ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పుట్టారు. తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి సౌండ్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ముంబై వెళ్లారు. బాలీవుడ్ దర్శకుడు భీమ్ సింగ్ దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశారు. తర్వాత ‘అగర్’ సినిమాతో దర్శకుడిగా మారారు. అహిస్తా అహిస్తా, జిద్, అగర్, గాడ్ అండ్ గన్, పోలీస్ పబ్లిక్, మజ్దూర్, దిల్ ఆఖిర్ దిల్ హై, బులుండి, నిశ్చయ్, సూర్య, ఝూతా సచ్ వంటి అనేక బాలీవుడ్ సినిమాలు రూపొందించారు. ఇస్మాయిల్ ష్రాఫ్ దర్శకత్వం వహించారు. తన కెరీర్‌లో దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. 2004లో వచ్చిన ‘తోడా తుమ్ బద్‌లో తోడా హమ్’ ఆయన చివరి సినిమా.