T20 World Cup: టీ20 ప్రపంచ కప్లో తొలి సెంచరీ.. దంచికొట్టిన దక్షిణాఫ్రికా బ్యాటర్
- 52 బంతుల్లో శతకొట్టిన రిలీ రొసో
- 104 పరుగుల తేడాతో బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం
- రాణించిన బౌలర్లు అన్రిచ్, షంసి
ఆస్ట్రేలియా వేదికగా జరగుతున్న టీ20 ప్రపంచ కప్ లో తొలి సెంచరీ నమోదైంది. దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ రిలీ రొసో (56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 109) శతకంతో దంచికొట్టాడు. సూపర్ 12 గ్రూప్2 లో భాగంగా గురువారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో రిసో.. బంగ్లాదేశ్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. కేవలం 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో, ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి ఘన విజయం సొంతం చేసుకుంది.
ఏకపక్షంగా సాగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. రొసోకు తోడు ఓపెనర్ క్వింటన్ డికాక్ (38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63) అర్ధ శతకంతో రాణించాడు. అనంతరం భారీ టార్గెట్ ఛేదనకు వచ్చిన బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్ (34) టాప్ స్కోరర్. దక్షిణాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ (4/10), తబ్రియాజ్ షంసి (3/20) సత్తా చాటారు. రొసోకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.