Andhra Pradesh: అమరావతి రైతుల యాత్రపై హైకోర్టులో విచారణ... ముగిసేదాకా కోర్టు హాలులోనే మంత్రి అమర్ నాథ్

ap minister gudivada amarnath sits in ap high court hall and listens hearing on amaravati farmers yatra

  • అమరావతి రైతుల యాత్రను నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం పిటిషన్
  • యాత్రకు భద్రత కల్పించాలంటూ అమరావతి రైతుల పిటిషన్
  • మంత్రి అమర్ నాథ్ ను ప్రతివాదిగా చేర్చిన అమరావతి రైతులు
  • ఈ వ్యవహారంలో తననూ ఇంప్లీడ్ చేసుకోవాలని పిటిషన్ వేసిన అమర్ నాథ్
  • విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్టు

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న యాత్రపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ మొత్తాన్ని స్వయంగా వినేందుకు కోర్టుకు వచ్చిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్... విచారణ ముగిసేదాకా కోర్టు హాలులోనే కూర్చుండిపోయారు. అమరావతి రైతుల యాత్రను నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. అదే సమయంలో తమ యాత్రకు ఎలాంటి అవాంతరం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని అమరావతి రైతులు మరో పిటిషన్ దాఖలు చేశారు. 

అమరావతి రైతులు తమ పిటిషన్ లో మంత్రి అమర్ నాథ్ ను ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన అమర్ నాథ్ తనను కూడా ఈ వివాదంలో ఇంప్లీడ్ చేసుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో అమరావతి రైతుల యాత్రపై జరిగిన విచారణను ఆయన సాంతం విన్నారు. రైతుల యాత్రపై ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేయాలన్న అమరావతి రైతుల వినతిని తిరస్కరించిన కోర్టు... ఈ విషయంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News