Twitter CEO: ట్విట్టర్ నుంచి తొలగించడంతో పరాగ్ అగర్వాల్ కు రూ.344 కోట్ల పరిహారం
- ఏడాదిలోపు తొలగిస్తే పరిహారం చెల్లించాల్సిందే
- అయినా ఇదేమీ భారీ మొత్తం కాదు
- 2021కి పరాగ్ అందుకున్న పారితోషికం రూ.250 కోట్లు
ట్విట్టర్ సీఈవోగా ఇంత కాలం కీలక బాధ్యతలు చూసిన భారతీయుడు పరాగ్ అగర్వాల్ కు ఇప్పుడు పెద్ద మొత్తం పరిహారంగా ముట్టనుంది. కొత్త బాస్ ఎలాన్ మస్క్ వచ్చీ రాగానే ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, అలాగే ట్విట్టర్ లీగల్ హెడ్ గా పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి విజయ గద్దె, సీఎఫ్ వో తదితరులను తొలగించారు.
2021 నవంబర్ లో ట్విట్టర్ సీఈవోగా అగర్వాల్ నియమితులయ్యారు. అప్పటి వరకు ఈ బాధ్యతలు చూసిన జాక్ డోర్సే అగర్వాల్ ను తన వారసుడిగా ప్రమోట్ చేశారు. నియమితులైన 12 నెలల్లోపే తొలగిస్తే చట్ట ప్రకారం 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.344 కోట్లు. అయినప్పటికీ పరాగ్ అగర్వాల్ కోణం నుంచి చూస్తే ఈ పరిహారం పెద్ద మొత్తం కాదు. ఎందుకంటే 2021కి పరాగ్ అగర్వాల్ అందుకున్న పారితోషికం 30.4 మిలియన్ డాలర్లు (రూ.250 కోట్లు). అంటే కేవలం ఓ ఏడాదికి సరిపడా వేతనం పరిహారం రూపంలో రానుంది.