Jammu And Kashmir: కశ్మీర్ లోయలో మిగిలిన చివరి పండిట్ మహిళ కూడా జమ్మూకి వలస

Last Kashmiri Pandit In Kashmir A Woman Migrates To Jammu

  • ఈ మధ్య కశ్మీర్ లోయలో పండిట్ లు లక్ష్యంగా చేసుకొని దాడులు
  • వాటికి భయపడి జమ్మూకు వలస వెళ్తున్న పండిట్లు
  • చౌదరిగుండ్, చోటిపొర గ్రామాల్లో కశ్మీర్ పండిట్ కుటుంబాల ఇళ్లకు తాళాలు

కశ్మీర్ పండిట్లు ప్రాణ భయంతో కశ్మీర్ లోయను వదిలి వెళ్తున్నారు. కశ్మీర్ లో నివసిస్తున్న చివరి పండిట్ అయిన డాలీ కుమారి అనే మహిళ కూడా జమ్మూకి వలస వెళ్లింది. షోపియాన్ జిల్లా చౌదరిగుండ్‌ గ్రామంలో తన కుటుంబంతో కలిసి వుంటున్న డాలీ గురువారం సాయంత్రం లోయను విడిచిపెట్టింది. ఆమె జమ్మూకి వలస వెళ్లింది. 

ఈ గ్రామంలో నివసిస్తున్న ఏడు పండిట్ కుటుంబాలపై దాడి చేసి వారిని హత్య చేయడంతో అక్కడి నుంచి జమ్మూకి వలసలు వేగవంతం అయ్యాయి. అక్కడ భయం భయంగా బతకడం ఇష్టంలేకనే జమ్మూ వెళ్లిపోతున్నట్టు డాలీ తెలిపింది. మిగతా కశ్మీరీ పండిట్‌లందరూ గ్రామాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఇక్కడే ఉండాలని తాను నిర్ణయించుకున్నానని ఆమె చెప్పింది. 

కానీ, తాను ఎంత ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపింది. లోయలో పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి వస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ఇది నా ఇల్లు. సొంతింటిని ఎవరు విడిచిపెట్టాలనుకుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఇష్టపడతారు. నేను నా ఇల్లు వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది’ డాలీ చెప్పింది. 

ఈ నెల 15న చౌదరిగుండ్ గ్రామంలో కశ్మీరీ పండిట్ పురాణ్ క్రిషన్ భట్ తన ఇంటి బయట హత్యకు గురయ్యాడు. రెండు నెలల క్రితం పక్కనున్న చోటిపొర గ్రామంలో యాపిల్ తోటలో కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ‘మీ పక్కన ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మీరు వణుకు, బెణుకు లేకుండా ఉంటారా చెప్పండి’ అని డాలీ ప్రశ్నిస్తోంది.  

ప్రస్తుతం ఆ గ్రామంలోని పండిట్‌ ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. వారు తమ తోటల్లోని యాపిల్ ఉత్పత్తులను విక్రయించడానికి కూడా గ్రామాలకు తిరిగి రావాలని అనుకోవడం లేదు. గ్రామంలో వేల సంఖ్యలో యాపిల్ బాక్సులను విడిచిపెట్టారు. చౌదరిగుండ్, చోటిపొర గ్రామాల్లో 11 పండిట్ కుటుంబాలు ఉండేవి. వీరంతా ఇప్పుడు జమ్మూకు వలస వెళ్లారు. అయితే, దాడులు, హత్యలకు భయపడి పండిట్ కుటుంబాలు వెళ్లిపోతున్నాయన్న వార్తలను జిల్లా యంత్రాంగం ఖండించింది. ఇవన్నీ తప్పుడు వార్తలని, పండిట్ లకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News