Telangana: ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థ ముందే అమర్చారా?: తెలంగాణ హైకోర్టు ప్రశ్న

ts high court asks cyberabada police have pre planned arrangements in bust the farm house deal

  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులకు రిమాండ్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు
  • ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన సైబరాబాద్ పోలీసులు
  • నిందితులు 24 గంటల పాటు హైదరాబాద్ ను వీడరాదని హైకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ శనివారానికి వాయిదా 
  • ఎమ్మెల్యేల కొనుగోలుపై ముందస్తు సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్న ఏజీ

టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నంపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో అరెస్టయిన నిందితులకు కస్టడీని నిరాకరించిన ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసులకు ఓ కీలక ప్రశ్న సంధించింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి వేదికగా నిలిచిన ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థను ముందే ఏర్పాటు చేశారా? అని హైకోర్టు ప్రశ్నించింది. నిందితులు 24 గంటల వరకు హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా నిందితులు తమ అడ్రెస్ లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఇవ్వాలని సూచించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా తెలంగాణ అడ్వొకేట్ జనరల్ పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నిందితులు యత్నించారని ఆయన తెలిపారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లను ఆఫర్ చేశారని అన్నారు. సీబీఐ, ఈడీ కేసుల నుంచి కూడా తప్పిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిందితులు ప్రలోభపెట్టారని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై ముందుగానే పూర్తి వివరాలు తెలియడంతో ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు. అయినా ప్రతి కేసులో 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా ఏజీ కోర్టుకు తెలిపారు.

  • Loading...

More Telugu News