Pawan Kalyan: కడప జిల్లాలో విద్యుత్ షాక్ తో రైతుల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి: పవన్ కల్యాణ్
- చాపాడు మండలం చియ్యపాడులో ఘటన
- పురుగుమందు పిచికారీ కోసం పొలం వెళ్లిన రైతులు
- తెగిపడిన విద్యుత్ వైర్లు తాకి షాక్
- రైతుల మృతి కలచివేసిందన్న పవన్ కల్యాణ్
కడప జిల్లాలో ముగ్గురు రైతులు విద్యుత్ షాక్ తో మృత్యువుకు బలవడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చాపాడు మండలం చియ్యపాడులో చోటుచేసుకున్న ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు.
పంటను కాపాడుకునేందుకు పురుగుమందులు పిచికారి చేయడానికి వెళ్లి ముగ్గురు రైతులు పొలంలోనే విద్యుత్ షాక్ కు గురై దుర్మరణం పాలయ్యారన్న వార్త కలచివేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. మరణించిన రైతులు పెద్దిరెడ్డి ఓబుల్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డిల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు.
విద్యుత్ వైర్లు తెగిపడిన ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఉందని క్షేత్ర స్థాయి సమాచారం చెబుతోందిన, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడంపై చూపే శ్రద్ధను, ముందుగా విద్యుత్ తీగలు సక్రమంగా ఉంచడంపై చూపాలని హితవు పలికారు. ఉడతలు కొరికాయి కాబట్టి తీగలు తెగాయి వంటి కారణాలు చెప్పి సమస్యను మరుగునపడేయొద్దని పవన్ స్పష్టం చేశారు. బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుని న్యాయబద్ధమైన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.