TRS: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కోడ్ నేమ్ ‘కొబ్బరి నీళ్లు తీసుకురండి’!

Code used to call cops on TRS poachers is naariyal paani le aiye
  • ఆ మాట వినిపించగానే ఫాంహౌస్ లోకి పోలీసుల ప్రవేశం
  • ముందే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
  • మారువేషాల్లో ఫాంహౌస్ లోపలా బయటా పోలీసులే
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే! ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, నందు, సింహయాజిల రిమాండ్ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది.

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పకడ్బందీగా సిద్ధమయ్యారు. రహస్యంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో ‘కొబ్బరి నీళ్లు తీసుకురండి’ అనే కోడ్ వర్డ్ ను ఉపయోగించినట్లు సమాచారం. పోలీసులు ఫాంహౌస్ లోకి ప్రవేశించవచ్చని సంకేతం ఇవ్వడానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈ పదాన్ని ఉపయోగించాలని అధికారులు సూచించారు. 

ఇక కోడ్ వర్డ్ వినిపించగానే అన్నివైపుల నుంచి ఫాంహౌస్ లోపలికి వెళ్లాలని అధికారులు ప్లాన్ చేశారు. ఇందుకోసం స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఏర్పాట్లను పరీక్షించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఫాంహౌస్ లోపల, బయట మారువేషాలతో పోలీసులను ఉంచినట్లు తెలిపాయి.

రిమాండ్ రిపోర్టులో..
ఫాంహౌస్ లో నిర్వహించిన ఆపరేషన్ కు నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో కోర్టుకు తెలిపారు. హాల్‌లో రహస్య కెమెరాలు, రోహిత్ రెడ్డి కుర్తా జేబుల్లో రెండు వాయిస్ రికార్డర్లు పెట్టామని వివరించారు. రహస్యంగా అమర్చిన కెమెరాలను మధ్యాహ్నం 3:05 నిమిషాలకు ఆన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. రామచంద్ర భారతి, నందుల మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ల వివరాలనూ పొందుపరిచారు.
TRS
Mla purchase
farm house
moinabad

More Telugu News