Bollywood: రాజకీయాల్లోకి బాలీవుడ్ నటి కంగన.. ప్రజాసేవ చేయాలని ఉందంటూ హింట్!

Bollywood Actress Kangana Ranaut Hints to join politics
  • హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని ఉందంటూ మనసులోని మాట బయటపెట్టిన కంగన
  • బీజేపీ అవకాశం ఇస్తే మండీ ప్రాంతం నుంచి పోటీ చేస్తానని వెల్లడి
  • మోదీకి రాహుల్ పోటీ కానేకాదన్న బాలీవుడ్ నటి
మహారాష్ట్రలో అప్పటి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంతో ఘర్షణ పడిన బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్‌కు బీజేపీ అండగా నిలిచింది. దీంతో త్వరలోనే ఆమె బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ ఊహాగానాలకు ఆమె స్పందించకున్నా ట్వీట్లతో తరచూ రాజకీయ పరిణామాలపై స్పందించేవారు. తాజాగా, ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రవేశానికి సిద్ధమవుతున్నట్టుగా చెప్పకనే చెప్పాయి. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కంగన మాట్లాడుతూ.. అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తన సొంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్ ప్రజలకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తానని చెప్పారు.

నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత ప్రతీ ఒక్కరిలోనూ జాతీయభావం కనిపిస్తోందన్నారు. తాను కాంగ్రెస్ విధానాలను అనుసరించే కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మోదీ పనితీరుతో ఇప్పుడు తమ కుటుంబం బీజేపీవైపు నిలిచిందన్నారు. తాను కనుక సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలని హిమాచల్ ప్రదేశ్, మరీ ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు, బీజేపీ కనుక కోరుకుంటే మండీ ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతూ కంగన తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్ రాహుల్ గాంధీ పోటీదారు కానేకాదని తేల్చి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్ ప్రకటించే ఉచితాలు పనిచేయవని కంగన పేర్కొన్నారు.
Bollywood
Kangana Ranaut
Himachal Pradesh
BJP

More Telugu News