Zimbabwe: పోరాడి ఓడిన జింబాబ్వే... బంగ్లాదేశ్ ఖాతాలో మరో విజయం
- ఇరు జట్లలోనూ ధాటిగా ఆడింది ఒక్కొక్కరే
- బంగ్లాదేశ్ విజయంలో బౌలర్ల కీలక పాత్ర
- చివరి ఓవర్లో గెలిచినంత పనిచేసిన జింబాబ్వే
టీ 20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ను మట్టికరిపించిన జింబాబ్వే నేడు బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చినంత పనిచేసింది. గెలిచే అవకాశాలున్న మ్యాచ్ లో చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది. చివరి ఓవర్ లో చివరి బంతి వరకు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ పరిస్తితులు అనుకూలించలేదు. చివరికి 3 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. దీంతో బంగ్లాదేశ్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్ నజ్ ముల్ హుస్సేన్ షాంతో చెలరేగి ఆడాడు. 55 పరుగులకు 71 స్కోర్ సాధించి.. జట్టు మెరుగైన స్కోరులో కీలకంగా వ్యవహరించాడు. ఇతడి తర్వాత అఫీఫ్ హుస్సేన్ చేసిన 29 పరుగులు రెండో అత్యధిక స్కోరుగా ఉందంటే.. ఆ జట్టు ఎలా ఆడిందో తెలుసుకోవచ్చు. రిచర్డ్ నగ్రవ, బ్లెస్సింగ్ ముజరబాని చెరో రెండు వికెట్లు తీశారు.
151 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుతిరిగారు. షాన్ విలియమ్స్ ఒక్కడే ధాటిగా ఆడాడు. 42 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. ఇతడు తప్పించి మరో ఆటగాడు పోరాట పటిమను చూపలేకపోయాడు. దీంతో చివరికి జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు ఇన్నింగ్స్ 147 పరుగుల వద్ద ఆగిపోయింది. షాన్ విలియమ్స్ కీలక దశలో రనౌట్ కావడం జింబాబ్వే అవకాశాలను దెబ్బతీసింది.
చివరి ఓవర్లో జింబాబ్వే విజయానికి 16 పరుగులు అవసరం కాగా, హైడ్రామా నడుమ చివరి బంతి వరకు మ్యాచ్ సాగింది. చివరి బంతికి జింబాబ్వే ఆటగాడు ముజరబాని అవుటయ్యాడని అందరూ భావించినా, వికెట్ కీపర్ తప్పిదం కారణంగా అది నోబాల్ అయింది. దాంతో 1 బంతికి 4 పరుగులు చేస్తే జింబాబ్వే గెలుస్తుందనగా, ముజరబాని పరుగు తీయలేకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, మొసద్దిక్ హుస్సేన్, ముస్తఫిజుర్ రెహ్మాన్ చెరో రెండు వికెట్లతో జింబాబ్వేను కట్టడి చేశారు. తద్వారా బంగ్లాదేశ్ విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు.