KCR: తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని మా నలుగురు ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు: సీఎం కేసీఆర్
- మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన సీఎం కేసీఆర్
- చండూరులో టీఆర్ఎస్ రణభేరి సభ
- బీజేపీపై నిప్పులు చెరిగిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు మునుగోడు నియోజకవర్గం చండూరులో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ రణభేరి బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడు సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఓసారి ఓట్లేసి గెలిపిస్తే... ఆ గెలిచినోడు (కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి) పత్తా లేకుండా పోయాడని, నాడు ఓడిపోయిన ప్రభాకర్ ఇప్పటికీ మీ మధ్యనే ఉన్నాడు అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఎలక్షన్ వస్తే చాలు గాయ్ గత్తర్ లొల్లి నడుస్తుందని, మతోన్మాద బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని స్పష్టం చేశారు. దోపిడీదారులు మాయమాటలు చెబుతూనే ఉంటారని, నమ్మవద్దని అన్నారు. మోదీ విశ్వగురువు కాదని, విషగురువు అని పేర్కొన్నారు. దేశంలో ఏ ప్రధాని కూడా చేయని దుర్మార్గాన్ని ఆయన చేనేతలకు చేశారని కేసీఆర్ మండిపడ్డారు. నేతన్నలపై జీఎస్టీ విధించి, ఇప్పుడు మళ్లీ వాళ్లనే ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.
ఇలాంటి బీజేపీకి చేనేత కార్మికులు మునుగోడులో ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచినవారికి ఓటు వేయాలా? అని అడిగారు. మునుగోడులో ఉప ఎన్నిక రావాల్సిన అవసరంలేదని, కానీ వచ్చిందని, బీజేపీకి ఓటు వేయకుండా చేనేతలు బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇక, ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైనా కేసీఆర్ నిప్పులు చెరిగారు. కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని, కానీ రూ.100 కోట్లు ఇస్తామన్నా అమ్ముడుపోకుండా తమ ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారని కొనియాడారు.
వడ్లు కొనడం చేతకాదు కానీ, వందల కోట్లు సంచుల్లో వేసుకుని ఎమ్మెల్యేలను కొనడానికి వస్తారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొని తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని ఆరోపించారు. అయితే, తెలంగాణ అంటే అమ్ముడుపోయేదికాదని తమ నలుగురు ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారని, ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు వారికి బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో వచ్చి చంచల్ గూడ జైలులో ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఇంత అరాచకం జరుగుతుంటే మౌనంగా ఉందామా? అని ప్రశ్నించారు. అసలు వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని కేసీఆర్ నిలదీశారు. దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించినవాళ్లు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు.