Team India: టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు ఓటమి రుచి చూపిన సఫారీలు
- ఆసీస్ గడ్డపై టీ20 వరల్డ్ కప్
- పెర్త్ లో దక్షిణాఫ్రికా విజయం
- 5 వికెట్ల తేడాతో ఓడిన భారత్
- మిల్లర్, మార్ క్రమ్ అర్ధసెంచరీలు
- ఈ టోర్నీలో భారత్ కు ఇదే తొలి ఓటమి
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా కు తొలి ఓటమి ఎదురైంది. పెర్త్ లో ఇవాళ దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-12 మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 134 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు 19.4 ఓవర్లలో ఛేదించారు.
టీమిండియా అంటే విశ్వరూపం ప్రదర్శించే డేవిడ్ మిల్లర్ మరోసారి విజృంభించాడు. మిల్లర్ 46 బంతుల్లో 59 పరుగులు చేసి దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయిడెన్ మార్ క్రమ్ 52 పరుగులు చేశాడు.
సాధించింది స్వల్ప స్కోరే అయినా, దాన్ని కాపాడుకునేందుకు టీమిండియా బౌలర్లు శక్తిమేరకు శ్రమించారు. అయితే, మిల్లర్ చివర్లో అశ్విన్ బౌలింగ్ లో కొట్టిన రెండు సిక్సులు మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాయి. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 6 పరుగులు అవసరం కాగా, మొదటి మూడు బంతులు ఎంతో జాగ్రత్తగా విసిరిన భువనేశ్వర్ కుమార్... నాలుగో బంతిని షార్ట్ బాల్ గా వేసి బౌండరీ సమర్పించుకున్నాడు. దాంతో దక్షిణాఫ్రికా పని సులువైంది.