Cable Bridge: గుజరాత్ లో మచ్చూ నదిపై కూలిన కేబుల్ బ్రిడ్జి... 32 మంది మృతి
- మోర్బీ ప్రాంతంలో విషాదం
- ప్రమాద సమయంలో వంతెనపై 500 మంది
- ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్న అనేకమంది
- 70 మందిని కాపాడిన సహాయక సిబ్బంది, పోలీసులు
- గుజరాత్ సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ
గుజరాత్ లోని మోర్బీలో మచ్చూ నదిపై ఉన్న ఓ కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందగా, అనేకమందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వంతెనపై 500 మంది ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నదిలో పడిన అనేకమందిని సహాయక సిబ్బంది, పోలీసులు కాపాడారు.
ఈ కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన వెంటనే చాలామంది నీళ్లలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఐదు రోజుల కిందటే ఈ కేబుల్ బ్రిడ్జి ఆధునికీకరణ పనులు పూర్తి చేశారు. ప్రమాద ఘటనపై గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి స్పందిస్తూ, 70 మందిని కాపాడామని వెల్లడించారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
కాగా, ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో మాట్లాడారు. ఘటన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
కాగా ఈ ఘటనలో మరణించిన వారికి గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించింది