Gujarat: గుజరాత్‌లో వంతెన కూలిన ఘటన.. 100కు పెరిగిన మృతుల సంఖ్య
- ప్రమాద సమయంలో బ్రిడ్జిపై 500 మంది వరకు ఉన్న పర్యాటకులు
- సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ప్రమాదం
- కొనసాగుతున్న సహాయక చర్యలు
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 100కు పెరిగింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరెంతోమంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై 500 మంది వరకు ఉన్నట్టు చెబుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి కూలిన తర్వాత కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. 70 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. గల్లంతైన వారి జాడ కోసం బోట్ల సాయంతో ప్రయత్నిస్తున్నారు.
వందేళ్ల క్రితం నాటి ఈ బ్రిడ్జికి ఐదు రోజుల క్రితమే మరమ్మతులు చేపట్టారు. మచ్చు నదిపై నిర్మించిన ఈ వేలాడే వంతెన స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలలో ఒకటి. బ్రిటిష్ కాలం నాటి ఈ బ్రిడ్జికి ఏడు నెలలపాటు మరమ్మతులు చేశారు. గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 26న దీనిని తిరిగి తెరిచి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నిన్న ఆదివారం కావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందాలను వీక్షిస్తూ ఆనందంగా గడుపుతుండగా సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వంతెనపై ఉన్నవారు ఒక్కసారిగా నీళ్లల్లో పడిపోయారు. నది లోతు ఎక్కువగా ఉండడంతో పలువురు మునిగిపోయారు. ఇంకొందరు కొట్టుకుపోయారు.
ఈత వచ్చిన కొందరు మాత్రం ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరు తీగలు పట్టుకుని వేలాడుతూ కనిపించారు. విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, ఈ ప్రమాదంలో మరణించిన వారికి రూ. 4 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం రూ. 2 లక్షల సాయం ప్రకటించింది. క్షతగాత్రులకు గుజరాత్ ప్రభుత్వం రూ. 50 వేల చొప్పున సాయం ప్రకటించింది.