Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు భారం.. పెరగనున్న చార్జీలు!

Hyderabad metro  Charges will soon Rise

  • చార్జీలను పెంచాలంటూ కేంద్రాన్ని కోరిన హైదరాబాద్ మెట్రో
  • ఫేర్ ఫిక్స్‌డ్ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం
  • నవంబరు 15లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులను కోరిన కమిటీ

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఇది షాకింగ్ వార్తే. త్వరలోనే మెట్రో చార్జీలు పెరగనున్నాయి. చార్జీలను పెంపుదల చేయాలన్న హైదరాబాద్ మెట్రో అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఫేర్ ఫిక్స్‌డ్ కమిటీ (ఎఫ్ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన కమిటీ ప్రస్తుతమున్న మెట్రో చార్జీల సవరణకు సంబంధించిన తమ అభిప్రాయాలను, సలహాలు, సూచనలను నవంబరు 15లోగా తెలపాలని ప్రయాణికులను కోరింది. ఈమెయిల్ అడ్రస్ [email protected] ద్వారా కానీ, చైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైలు భవన్, బేగంపేట, 500003 అడ్రస్‌కు పోస్ట్ ద్వారా కానీ పంపాలని సూచించింది.

సాధారణంగా మెట్రో రైలు చార్జీలు పెంచే అధికారం మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్ (ఎంఆర్ఏ)కు తొలిసారి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వాటిని సవరించే అధికారం మాత్రం కేంద్రం నియమించే ఫేర్ ఫిక్సేషన్‌ కమిటీకే ఉంటుంది. మెట్రో చార్జీలను ఏ మేరకు పెంచాలన్నది ఇంకా నిర్ణయించలేదని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 

కాగా, మెట్రో రైలులో ప్రస్తుతం కనిష్ఠ చార్జీ రూ. 10 కాగా, గరిష్ఠ చార్జీ 60 రూపాయలు. ఇదిలావుంచితే, కేంద్రం నియమించిన కమిటీకి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గుడిసేవ శ్యాంప్రసాద్ చైర్మన్‌గా, కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సురేంద్ర కుమార్ బగ్దె, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌లు సభ్యులుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News