MS Narayana: టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు .. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి: ఎమ్మెస్ తనయుడు
- హాస్యనటుడిగా ఎమ్మెస్ కి మంచి గుర్తింపు
- నటుడిగా రాణించలేకపోయిన ఆయన తనయుడు
- టాలెంట్ .. నేపథ్యం ఉంటే సరిపోదన్న విక్రమ్
- అదృష్టం కూడా ఉండాలనేది తన అభిప్రాయమంటూ వెల్లడి
టాలీవుడ్ హాస్య నటులలో దివంగత ఎమ్మెస్ నారాయణ ఒకరు. ఆయన తనయుడు విక్రమ్ నటుడిగా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నించినప్పటికీ, పెద్దగా కలిసిరాలేదు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నేను మంచి ఆర్టిస్టును అవుతాను అనే ఒక బలమైన నమ్మకం నాకు ఉండేది. అందువలన ఆ దిశగా కాస్త గట్టిగానే ట్రై చేశాను" అన్నారు.
"సినిమా ఇండస్ట్రీ అంటారుగానీ .. ఇది ఇండస్ట్రీ కాదు .. ఫ్యాక్టరీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి కలిసినవారిని మళ్లీ కలుస్తామో లేదో చెప్పలేము. ఒకసారి కలిసి పని చేసినవారితో మళ్లీ పనిచేస్తామనే నమ్మకం లేదు. ఇక్కడ జరిగేది కేవలం బిజినెస్. ఇక బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు ఇక్కడ పైకి వస్తారని చెప్పుకుంటూ ఉంటారు. అదే నిజమైతే అభిషేక్ బచ్చన్ నెంబర్ వన్ హీరో అయిపోవాలి. కానీ అలా జరగలేదు కదా?" అన్నారు.
"ఇక టాలెంట్ ఉన్నవారు మాత్రమే ఇక్కడ నిలబడతారని కూడా గట్టిగా చెప్పలేం. ఎందుకంటే తరుణ్ .. అబ్బాస్ .. వరుణ్ సందేశ్ .. వీళ్లంతా కూడా సక్సెస్ ను చూసిన హీరోలు. కానీ ఆ తరువాత వారికి సినిమాలు లేవు. అందుకు కారణం వాళ్లలో ఉన్న టాలెంట్ తగ్గిపోవడం కాదుగా. దేనికైనా టైమ్ కలిసి రావాలి .. అదృష్టం కూడా కలిసొచ్చినప్పుడే మిగతావన్నీ కూడా తోడవుతాయి' అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.