Kishan Reddy: మీ పరిపాలనలో ఎక్కడైనా నైతికత ఉందా?: కేసీఆర్ ను ప్రశ్నించిన కిషన్ రెడ్డి
- నిన్న చండూరులో కేసీఆర్ ప్రసంగం
- బీజేపీపై విమర్శనాస్త్రాలు
- తీవ్రంగా స్పందించిన కిషన్ రెడ్డి
- ఏ ముఖంతో ఓట్లు అడుగుతున్నారని ఆగ్రహం
చండూరు సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మీ పరిపాలనలో ఎక్కడైనా నైతికత ఉందా? అని కేసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నానని తెలిపారు. ఇచ్చిన హామీలను ఎప్పుడైనా నిలబెట్టుకున్నారా? అని నిలదీశారు. లక్షా 75 వేల ఎకరాలకు నీరందిస్తామని 2014లోనూ, 2018లోనూ చెప్పారని, కానీ ఒక్క అంగుళానికి కూడా నీరివ్వలేదని విమర్శించారు.
నాడు చంద్రబాబుపై విమర్శలు చేశారని, ఇప్పుడు బీజేపీని కారణంగా చూపుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మీరు అనుకున్న చోట ప్రాజెక్టులు కడతారు... మీరు కట్టలేని చోట నేరం బీజేపీదా?.... ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మునుగోడులో ఓట్లు అడగడానికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిండి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎవరు అడ్డొచ్చారు? అని నిలదీశారు.
"మునుగోడులో రోడ్లు, పాఠశాల భవనాలు చిన్న చిన్న విషయాలు అంటున్నారు... కానీ ప్రజలు ఆ చిన్న చిన్న విషయాలే అడుగుతున్నారు. ఈ తొమ్మిది సంవత్సరాలుగా ఏంచేస్తున్నారు? అసెంబ్లీ గురించి ఆలోచించారు తప్ప తెలంగాణలో మౌలిక వసతుల కల్పన కోసం ఏమాత్రం కృషి చేయలేదు. మునుగోడులో డిగ్రీ కాలేజి అన్నావు, 100 పడకల ఆసుపత్రి, ఐటీఐ అన్నావు... వీటన్నింటికి రికార్డులు ఉన్నాయి.... ఇప్పుడొచ్చి ఇవన్నీ చాలా చిన్న విషయాలు అంటున్నావు... గెలిపిస్తే 15 రోజుల్లో ఏర్పాటు చేస్తానంటున్నావు... ఏ విధంగా చేస్తావు. నేను ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తున్నాను, బంగ్లాదేశ్ గురించి ఆలోచన చేస్తున్నాను అని చెబుతున్నావు. మీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా? మునుగోడులో 9 ఏళ్లుగా చేయలేనిది 15 రోజుల్లో చేస్తావా?" అంటూ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
వేరే పార్టీలో గెలిచినవారిని పార్టీలో చేర్చుకుని ప్రజల తీర్పును కాలరాస్తూ, మంత్రిపదవులు ఇచ్చిన అనైతిక చరిత్ర కేసీఆర్ కు, కల్వకుంట్ల కుటుంబానికే సొంతం అని విమర్శించారు. "నిన్న వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు వేరే పార్టీ గుర్తుపై గెలిస్తే, వారి గురించి చెబుతూ ఆత్మగౌరవం అంటూ మాట్లాడుతున్నావు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అంటున్నావు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కల్వకుంట్ల కుటుంబం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు. నిన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బహిరంగ సభలో కేసీఆర్ చెప్పులు పట్టుకున్నాడు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టాడు. మీరా మాకు ఆత్మగౌరవం గురించి చెప్పేది?
ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురిని ఓ ప్రలోభాలకు గురిచేసి మీ పార్టీలో చేర్చుకున్నారు? ఎన్ని కోట్లు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు? ఏ తాయిలాలు ఇచ్చారు? అనేది కూడా చెప్పి ఉంటే బాగుండేది. ప్రజలు ఏమనుకుంటారో అన్న పట్టింపు కూడా లేదు.
టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అవినీతిని, కుటుంబపాలనను సమర్థించినవాళ్లం అవుతాము. పేదలకు ఇళ్లు రావాలంటే కేసీఆర్ ఓడిపోవాలంతే. మోదీ ప్రభుత్వంతోనే పేదలకు ఇళ్లు వస్తాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నది మేము... కేసీఆర్ కాదు. కేంద్రంలో ఏంచేయాలో నువ్వు కాదు మాకు చెప్పేది! విద్యుత్ మోటార్లకు మీటర్లు ఉండవని స్పష్టంగా చెప్పాం. మేమైతే మీటర్లు పెట్టబోవడంలేదు. ఒకవేళ కేసీఆర్ భవిష్యత్తులో మీటర్లు పెడితే మాత్రం భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది" అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.