Bharat Jodo Yatra: పూనం కౌర్ చేతిని రాహుల్ గాంధీ కావాలని పట్టుకోలేదు: కొండా సురేఖ
- భారత్ జోడో యాత్రలో పాల్గొన్న నటి పూనం కౌర్
- యాత్రలో రాహుల్ చేతిని పట్టుకుని నడిచిన నటి
- ఫొటోను షేర్ చేస్తూ విమర్శలు గుప్పించిన బీజేపీ నేత ప్రీతి గాంధీ
- ప్రీతి గాంధీ పోస్టును ఖండించిన కొండా సురేఖ
- బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు
- కిందపడబోతే రాహుల్ తన చేయి పట్టుకున్నారన్న పూనం
భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ టాలీవుడ్ నటి పూనం కౌర్ చేయి పట్టుకుని మరీ నడిచిన తీరుపై వినిపిస్తున్న విమర్శలపై ఆ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి కొండా సురేఖ స్పందించారు. రాహుల్ గాంధీ కావాలని పూనం చేతిని పట్టుకోలేదని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవిస్తుందని ఆమె తెలిపారు. ఇందిరా గాంధీ నుంచి సోనియా గాంధీ వరకు మహిళలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఆడవాళ్లను తల్లిలాగే చూసే పార్తీ తమదని ఆమె గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఆమె బీజేపీపై విమర్శలు గుప్పించారు. పాదయాత్ర చేయని దిక్కుమాలిన పార్టీ ఒక బీజేపీ మాత్రమేనని సురేఖ అన్నారు. పాదయాత్ర చేస్తే జనంతో ఎలా ఉండాలో తెలుస్తుందన్నారు. తప్పులుంటే వేలెత్తి చూపాలి గానీ చిల్లర ప్రయత్నాలు చేయరాదని... బీజేపీ ఆ చిల్లర రాజకీయాలను మానుకోవాలని ఆమె హితవు పలికారు. పూనం చేతిని రాహుల్ పట్టుకున్నారంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆమె అన్నారు.
ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో భారత్ జోడో యాత్రలో పూనం కౌర్ పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె రాహుల్ గాంధీ చేతిని పట్టుకుని మరీ యాత్రలో కొంతదూరం నడిచారు. ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ బీజేపీ నేత ప్రీతి గాంధీ... తాత నెహ్రూ అడుగుజాడల్లోనే రాహుల్ గాంధీ నడుస్తున్నారంటూ విమర్శించారు. ఈ విమర్శలను ఖండిస్తూ కొండా సురేఖ స్పందించారు. అదే సమయంలో ప్రీతి గాంధీ పోస్టుపై పూనం కూడా స్పందించారు. తాను కిందపడబోతే... రాహుల్ గాంధీ తన చేతిని పట్టుకున్నారని వివరణ ఇచ్చారు.