Haryana: గురుగ్రామ్‌లో దారుణం.. హోటల్‌లో పదో తరగతి బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం

10th Student gang raped in Gurugram Hotel
  • హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘటన
  • బాలికను బైక్‌పై ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లిన ఇద్దరు స్నేహితులు
  • అక్కడ మరో ముగ్గురితో కలిసి అత్యాచారం
హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికను బైక్‌పై హోటల్‌కు తీసుకెళ్లిన ఇద్దరు స్నేహితులు.. మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బయటకు వెళ్లిన బాలిక రాత్రయినా ఇంటికి తిరిగి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో బాలిక ఇంటి సమీపంలో కనిపించింది. 

కుమార్తెను ఇంటికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు నిన్నంతా ఏమైపోయావని ప్రశ్నించగా, బాలిక చెప్పింది విని హతాశులయ్యారు. తన స్నేహితులు ఇద్దరు బైక్‌పై హోటల్‌కు తీసుకెళ్లారని, అక్కడ మరో ముగ్గురితో కలిసి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. విషయం ఎక్కడా చెప్పొద్దని, చెబితే చంపేస్తామని హెచ్చరించారని చెప్పింది.

దీంతో షాకైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
Haryana
Gurugram
Gang Rape
Crime News

More Telugu News