Narendra Modi: కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ప్రశంసలు గుప్పించిన ప్రధాని మోదీ
- మన దేశ సీనియర్ సీఎంలలో గెహ్లాట్ ఒకరని మోదీ ప్రశంస
- ముఖ్యమంత్రులుగా ఇద్దరం కలిసి పని చేశామని వ్యాఖ్య
- గిరిజనులు లేకుండా మన చరిత్ర లేదన్న మోదీ
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. రాజస్థాన్ లోని బన్స్వారాలో ఆయన ప్రసంగిస్తూ గెహ్లాట్ గొప్పదనం గురించి మాట్లాడారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ సమయంలో గెహ్లాట్ తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు.
గెహ్లాట్ మన దేశంలో ఉన్న అత్యంత సీనియర్ సీఎంలలో ఒకరని, అత్యంత అనుభవం కలిగిన రాజకీయ నేత అని కొనియాడారు. ముఖ్యమంత్రులుగా తామిద్దరం కలిసి పని చేశామని చెప్పారు. దశాబ్దాలుగా చేసిన ఒక తప్పును ఇప్పుడు మన దేశం సరిచేసుకుంటోందని... స్వాతంత్ర్యం తర్వాత రాసిన మన దేశ చరిత్రలో గిరిజనులను విస్మరించారని.. గిరిజనులు లేకుండా మన దేశ చరిత్ర లేదని అన్నారు. మన స్వాతంత్ర్య పోరాటం చరిత్రలోని ప్రతి పేజీని గిరిజనుల శౌర్యంతో నింపుతామని చెప్పారు.
మరోవైపు మోదీ వ్యాఖ్యలపై గెహ్లాట్ స్పందించారు. మనదేశంలో ఉన్న బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కారణంగానే మోదీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపును పొందుతున్నారని చెప్పారు. మన ప్రజాస్వామ్యం ఘనత గురించి తెలిసిన ప్రతి దేశ అధినేత... మన ప్రధానిని ఎంతో గౌరవిస్తారని అన్నారు. మరోవైపు, ఆరోజు జరిగిన కార్యక్రమంలో మోదీ, గెహ్లాట్ ఇద్దరూ వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగానే గెహ్లాట్ పై మోదీ ప్రశంసలు గుప్పించారు.