Beauty Parlor Stroke Syndrome: 'బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్'తో జాగ్రత్త అంటున్న వైద్య నిపుణులు

Medical experts warns about Beauty Parlor Stroke Syndrome

  • బ్యూటీ పార్లర్ లో హెడ్ వాష్ ద్వారా ఆరోగ్య సమస్య
  • బేసిన్ అంచులకు మెడ నొక్కుకుపోయి నరాలపై ఒత్తిడి
  • మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయే ప్రమాదం
  • మెదడు కణజాలానికి ఆక్సిజన్ అందక స్ట్రోక్ ముప్పు

ఇటీవల కాలంలో పల్లెటూర్లలో కూడా బ్యూటీ పార్లర్లు వెలుస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళల్లో అందం పట్ల జాగ్రత్తలు తీసుకునే ధోరణి పెరుగుతోంది. బ్యూటీ పార్లర్లలో అనేక సేవలు అందిస్తుంటారు. వాటిలో స్పెషల్ హెడ్ వాష్ కూడా ఒకటి. కేవలం తల వరకే స్నానం చేయిస్తారు. ఓ బేసిన్ పై తలను ఉంచి, ఖరీదైన షాంపూతో కురులను శుభ్రపరిచి, జుట్టు నిగనిగలాడేలా చేస్తారు. 

ఈ సందర్భంగా కస్టమర్లు బేసిన్ అంచులపై తలను పెట్టుకోవాల్సి రావడం అసౌకర్యం కలిగిస్తుంది. అందం కోసం ఆ మాత్రం కష్టపడలేమా అని వారు భావిస్తుంటారు. అయితే ఇక్కడో ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. బ్యూటీ పార్లర్ కు వెళ్లి హెడ్ వాష్ చేయించుకునేవారు బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

దీనిపై హైదరాబాదు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ వివరాలు తెలిపారు. ఓ బ్యూటీ పార్లర్ లో హెడ్ వాష్ చేయించుకుని 50 ఏళ్ల మహిళ బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ కు గురైందని వెల్లడించారు. 

హెడ్ వాష్ కోసం బేసిన్ అంచులపై మెడను ఉంచాల్సివచ్చినప్పుడు, మెడపై విపరీతమైన ఒత్తిడి పడుతుందని తెలిపారు. బేసిన్ అంచులకు మెడ నరాలు నొక్కుకుపోతాయని, తద్వారా మెదడుకు, వెన్నెముకకు రక్తప్రసరణ సరిగా జరగదని వెల్లడించారు. దాంతో మెదడు కణజాలం తగినంత ఆక్సిజన్ ను అందుకోలేదని, ఈ పరిస్థితి స్ట్రోక్ కు దారితీస్తుందని సుధీర్ కుమార్ వివరించారు. 

అంతేకాదు, మెదడులో ఆక్సిజన్ అందని భాగం అధీనంలో ఉండే శరీర భాగం కూడా తీవ్రంగా దెబ్బతింటుందని వెల్లడించారు. 50 ఏళ్ల మహిళ ఇలాగే హెడ్ వాష్ కు వెళ్లి ఈ సిండ్రోమ్ కు గురైందని, తలతిప్పడం, వికారం, వాంతులతో బాధపడిందని తెలిపారు. ఇవి బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ కు ప్రారంభ లక్షణాలని పేర్కొన్నారు. 

ఆమెను తొలుత గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లగా, ఆమె సమస్యకు మూలకారణాన్ని గుర్తించలేకపోయారని డాక్టర్ సుధీర్ కుమార్ చెప్పారు. తర్వాతి రోజు ఆమె నడుస్తున్నప్పుడు అడుగులు తడబడడం వంటి సమస్యలు ఎదుర్కొందని, దాంతో ఎంఆర్ఐ స్కాన్ చేస్తే, మెదడులో కొంత భాగం దెబ్బతిన్న విషయం వెల్లడైందని, తద్వారా ఆమె బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ కు గురైనట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. 

కాగా, హార్వర్డ్ మెడికల్ స్కూల్ న్యూరాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనీష్ సింఘాల్ స్పందిస్తూ, ఈ సిండ్రోమ్ హెడ్ వాష్ ద్వారా మాత్రమే కాకుండా, పాక్షికంగా పడుకుని ఉన్న భంగిమలో దంతవైద్యుడి వద్ద చికిత్స తీసుకునేటప్పుడు, టెన్నిస్ ఆడేటప్పుడు, చిరోప్రాక్టిక్ విధానంలో మెడ తిప్పేటప్పుడు, ఒక్కోసారి యోగా చేసేటప్పుడు కూడా సంభవిస్తుందని వివరించారు.

  • Loading...

More Telugu News